అయ్యో అయ్యయ్యో.. ఏపీ మాజీ సీఎం టు పులివెందుల మాజీ ఎమ్మెల్యే..!?
posted on Oct 24, 2025 @ 5:02PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరుకు ముందు మరో మాజీ కూడా చేరనుందా? ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రే కాకుండా పులివెందుల మాజీ ఎమ్మెల్యేగా కూడా మారనున్నారా? అంటే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాటలను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని మరోమారు హెచ్చరించారు. విశాఖపట్నంలో ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు.. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే, రాజ్యాంగం ప్రకారం ఆటోమేటిగ్గా శాసనసభ సభ్యత్వం రద్దైపోతుందని చెప్పారు. ఆ ప్రకారంగా చూస్తే జగన్ మరో పాతిక రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఆయన గైర్హాజరైతే.. ఇక అంతే సంగతులు అని పరోక్షంగా జగన్ ను హెచ్చరించారు కూడా.
అదే సమయంలో గతంలో నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ హయాంలో అంటే జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ మొత్తం 67 రోజులు మాత్రమే సమావేశమైందన్న ఆయన.. చివరి రెండేళ్లలో అంటే చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన కాలంలో అసెంబ్లీ కేవలం 37 రోజులు మాత్రమే సమావేశమైందని చెప్పారు. అయితే జగన్ ఇప్పటికే 35 రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారనీ, మరో పాతిక రోజులు ఆయన అసెంబ్లీ పనిదినాలలో సభకు హాజరు కాకపోతే ఆటోమేటిగ్గా మాజీ అవుతారని చెప్పారు.
దీంతో నెటిజనులు జగన్ కోరుతున్నట్లు ప్రతిపక్షహోదా సంగతి అటుంచి మొదటికే మోసం అంటే అసెంబ్లీ సభ్యత్వానికే ఎసరు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారని ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే జగన్ పరిస్థితి ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయె అన్నట్లుగా తయరయ్యేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రస్థానం మాజీ సీఎం టు పులివెందుల మాజీ ఎమ్మెల్యే వరకూ సాగుతుందా? లేక మనసు మార్చుకుని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు వీడి అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారా?