జగమంత కుటుంబంలో షర్మిలమ్మకు చోటే లేదా?
posted on Nov 20, 2013 @ 9:00PM
జగనన్న వదిలేసిన బాణం మరి ఎక్కడ పడిపోయిందో గానీ ఈ మధ్యన ఎవరికీ కనబడలేదు. అతను వదిలిన ఆ బాణం లాంగ్ రేంజి మిసైల్లాగా ఏకంగా 3000కిమీ దూరం పయనించి, మరే లక్ష్యం చేదించిందో తెలియదు కానీ, గత కొన్ని రోజులుగా ఎవరికీ కనబడలేదు. హైదరాబాదులో జబర్దస్త్ గా నిర్వహించిన సమైక్య సభలోనయినా తన బాణం గొప్పదనం గురించి నలుగురికి చెపుతాడని జనాలందరూ భావించినప్పటికీ, ఓట్లు, సీట్ల బాధలో పడి పాపం! ఆ బాణం సంగతి మరిచిపోయాడు జగనన్న.
అయితే పెరటి మొక్క లాంటి షర్మిలమ్మను పట్టించుకోకపోయినా మమతలు కురిపించే దీదీ (అక్క) మమతా బెనర్జీని కలిసేందుకు కోర్టు అనుమతి తీసుకొని కోల్ కత వెళ్లి మరీ వెళ్లి కలిసారు. ఆమెకు కూడా పక్కలో బల్లెంలా గోర్ఖాలాండ్ విభజన వాదులున్నందున, విభజన కష్టం అంటే ఏమిటో తెలుసు గనుక బ్రదర్ జగన్ పై మమతానురాగాలు కురిపిస్తూ “తమ పార్టీ కూడా రాష్ట్రాల విభజనకు వ్యతిరేఖమని” ప్రకటించారు.
ఇంతవరకు షర్మిలమ్మే లోకంగా బ్రతుకుతున్న జగనన్నయకి ఇప్పుడు కొత్తగా దొరికిన మమతక్కాయ్ ఊహించని విధంగా కురిపించిన మమతానురాగాలకి పొంగిపోతూ లక్నోలో ఉన్న అఖిలేష్ యాదవన్నయ్యనో, తమ్ముడ్నో వెతుకొంటూ బయలుదేరుతున్నాడు. ఆ సోదరుడు కూడా పక్కా సమైక్యవాదే కాకుండా తనలాగే సీబీఐతో నానా బాధలు పడుతున్నాడు గనుక బహుశః ఒకరి కష్టం మరొకరు బాగానే అర్ధం చేసుకోవచ్చును.
ఆ తరువాత చెన్నై వెళ్లి జయక్కాయ్ ని, ఓడిశాలో నవీన్ అన్నయని కూడా కలవాలని ఈ అపూర్వ సోదరుడు భావిస్తున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిపోయిన జగమంత కుటుంబంలో చెల్లెమ్మ ఎక్కడా కనబడకపోయినా, నదులు, రాష్ట్రాలు దాటి మరీ కొత్త సోదర సోదరీ మణులను వెతుకొంటూ బ్రదర్ జగన్ పయనమవుతున్నారు.
ఈనాటి ఈ అనుబంధాలే రానున్న ఎన్నికల తరువాత పండంటి ఉమ్మడి కుటుంబం (తర్డ్ ఫ్రంట్)గా పెరిగితే చూడాలని జగనన్న తాపత్రయం. కానీ సీబీఐ కోర్టు మాత్రం అతని బాధను అర్ధం చేసుకోలేక అడిగినప్పుడల్లా అనుమతులు మంజూరు చేయడం కుదరదంటూ ఒకటే విసిగిస్తోంది.