వైసీపీ ఎంపీ సంస్థలో 300 కోట్ల బ్లాక్ మనీ
posted on Jul 9, 2021 @ 5:14PM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి చెందిన రాంకీ సంస్థలో జరిగిన సోదాలపై ఐటీశాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి చైర్మన్ గా కొనసాగుతున్న సంస్థ.. ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపెట్టిందని తెలిపింది. రూ.1200 కోట్లు కృతిమ నష్టాన్ని రాంకీ చూపించిందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
రాంకీలో మేజర్ వాటాను సింగపూర్‌కు చెందిన వ్యక్తులకు అమ్మేశారని తెలిపింది. తప్పుడు లెక్కలు చూపెట్టి రూ.300 కోట్లు పన్ను ఎగ్గొట్టేందుకు యత్నించారని ఐటీ శాఖ తన ప్రెస్ నోట్ లో వెల్లడించింది. రూ.288 కోట్లకు సంబంధించిన పత్రాలను సంస్థ నాశనం చేసిందని తెలిపింది. ఆ సంస్థకు సంబంధించి లెక్కలేని రూ.300 కోట్ల నగదు లావాదేవీలను గుర్తించామని ఐటీ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాంకీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లతో పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ వాటిలో ప్రాజెక్టు చేపట్టింది.
ఈనెల 6న వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. రాంకీ సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహించారు.సంస్థలతోపాటు ఎంపీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.