గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు... ఐటీ రైడ్స్ లో కల్కి గుట్టురట్టు...
posted on Oct 21, 2019 @ 12:50PM
గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు... కిలోలకొద్దీ బంగారం... కోట్ల విలువైన డైమండ్లు... వందల కోట్ల రూపాయల దేశ విదేశీ కరెన్సీ... వేల కోట్ల అక్రమాస్తులు... ఇదీ కల్కి ఆశ్రమాల్లో పరిస్థితి. ఐటీ దాడుల్లో కల్కి గుట్టురట్టవుతుంది. ఐటీ దాడులతో కల్కి అక్రమ సామ్రాజ్యంలో చీకటి కోణం వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే కాదు... విదేశాల్లోనూ కల్కికి అక్రమ ఆస్తున్నాయని తేలింది. కల్కి ఆశ్రమంతోపాటు 40చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ దాడుల్లో వందల వేల కోట్ల విలువైన ఆస్తులతోపాటు బంగారం, నగదు దొరకడంతో అధికారులే నివ్వెరపోయారు.
కోట్లాది రూపాయలు పోగుపడటంతో కల్కి కుమారుడు కృష్ణాజీ పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వేలాది ఎకరాల భూములు కొన్నారు. సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో ట్రస్టు ఏర్పాటు చేశారు. ట్రస్టు కోసం భారీ మొత్తంలో నిధులు సేకరించారు. తరచూ ట్రస్టు పేర్లు మారుస్తూ ఐటీ శాఖను బురిడీ కొట్టించారు. వందల కోట్ల రూపాయల ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్లు రికార్డుల్లో తేలింది. అయితే, నాలుగైదు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నా... కల్కి, అమ్మ భగవాన్ మాత్రం ఎక్కడున్నారనేది మాత్రం తెలియడం లేదు. అసలు ఆశ్రమంలో ఉన్నారా లేరా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే, కల్కి అక్రమాలపై నిగ్గుతేల్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కల్కి భగవాన్ ఎన్నికలప్పుడు ఓ పార్టీకి కొమ్ముకాశారని... వారికి సొమ్ములిచ్చారని ఆరోపిస్తున్నారు. కృష్ణా దాసాజీ, లోకేష్ దాసాజీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని కోరుతున్నారు.