బీజేపీ దెబ్బకు జగన్‌రెడ్డి దిగొచ్చారా? భయంతోనే అమరావతికి జై కొట్టారా?
posted on Nov 22, 2021 @ 11:18AM
ఎంత చెప్పినా వినలేదు.. ఎవరు చెప్పినా పట్టించుకోలేదు.. జగమొండిగా వ్యవహరించింది. ఆంధ్రుల కలల రాజధానిని మూడు ముక్కలు చేసింది. రైతులను గోస పెట్టుకున్నారు. లాఠీలతో కొట్టారు. కేసులు పెట్టి జైల్లో పెట్టారు. కోర్టులకు వెళ్లినా వెనక్కి తగ్గలేదు. మొండిగా.. మూర్ఖంగా.. అమరావతిని అంతం చేసే కుట్రలు, కుతంత్రాలు చేశారు. అలాంటి జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు సడెన్‌గా మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బుద్ది తక్కువైంది.. తప్పు అయింది.. అని లెంపలేసుకోకపోయినా.. రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పకపోయినా.. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచేందుకు అంగీకరించింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది.
సడెన్‌గా వైసీపీ ప్రభుత్వంలో ఎందుకింత మార్పు? ఉన్నపళంగా ఎందుకిలా మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్టు? ఇన్నాళ్లూ తగ్గేదే లేదంటూ మొండిగా ఉన్న జగన్‌రెడ్డితో ఇప్పటికిప్పుడు ఎందుకంత మార్పు? అంటే.. అందుకు అనేక కారణాలే చెబుతున్నారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న రీజన్.. బీజేపీ ఎంట్రీ.. అమిత్‌షా వార్నింగ్.
ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తిరుపతికి వచ్చారు. ఏపీ బీజేపీ పెద్దలతో మీటింగ్ పెట్టారు. అందులో ఫుల్ షంటింగ్స్. మీకసలు బుద్దిందా అనేలా.. రాష్ట్ర బీజేపీ నేతలకు ఓ రేంజ్‌లో క్లాస్ ఇచ్చారు. అమరావతికి అనుకూలంగా పార్టీ తరఫున తీర్మానం చేశాక.. రైతుల పాదయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదంటూ మండిపడ్డారు. అమిత్‌షాకు ఏమీ తెలీదనుకున్నారో ఏమో.. స్టేట్ లీడర్స్ పాదయాత్రపై రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అదంతా ఓ పార్టీ చేస్తున్న యాత్ర అని, ఓ వర్గం వారే ఉంటున్నారని చెప్పగా.. అమిత్‌షా సీరియస్ అయ్యారు. అదేంటి.. అందరూ రైతులేగా.. రైతులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొనకుండా సిల్లీ రీజన్స్ చెబుతున్నారేంటని ఫుల్ ఫైర్ అయ్యారు. దెబ్బకు దెయ్యం వదిలినట్టుంది. రెండుమూడు రోజులు రెస్ట్ తీసుకొని మరీ.. ఆదివారం అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో పాల్గొన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.
తెలుసుగా.. అమిత్‌షా అన్నా.. బీజేపీ అన్నా.. జగన్‌రెడ్డికి ఎంత భయమో. ఆయన జుట్టు కేంద్రం చేతిలో ఉండటం.. సీబీఐ, ఈడీ కేసుల ఉచ్చు బిగిసి ఉండటం వల్లనో ఏమో.. అమిత్‌షా పేరెత్తితేనే జగన్‌రెడ్డి భయంతో వణికి పోతుంటారని అంటారు. అలాంటిది అమిత్‌షా ఆదేశాలతో ఏపీ బీజేపీ నేతలు పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అమరావతి ఏకైక రాజధాని డిమాండ్‌కు చాలా బలం చేకూరింది. సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వాళ్లు దూకుడుగా ఉండటంతో జగన్‌లో బెదురు మొదలైంది.
మరోవైపు, మోదీ అంతటి మొండిఘటమే.. మూడు వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గి.. వాటిని ఉపసంహరించుకుంటామని ప్రకటించి.. రైతులకు క్షమాపణలు చెప్పడం.. జగన్‌రెడ్డిలో మార్పును, భయాన్ని ఒకేసారి తీసుకొచ్చాయని చెబుతున్నారు. రైతు ఉద్యమానికి మోదీనే దిగొచ్చారు.. తానో లెక్కా? అనుకున్నారో ఏమో.. అమరావతి కోసం 700 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రకంపణలతో తమ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని భయపడినట్టున్నారు. దెబ్బకు దిగొచ్చి.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇది ప్రజా విజయం.. అమరావతి విజయం. జై అమరావతి.. జైజై అమరావతి.