అతని ఖరీదు 16 కోట్లు
posted on Feb 16, 2015 9:14AM
ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ మంచి ఫామ్‌లో వున్న సమయంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. అయినప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మంచి ఫామ్‌లోకి వచ్చి క్రికెట్‌లో అదరగొట్టాడు. చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు. అయితే ఈసారి ప్రపంచకప్‌కి యువరాజ్ ఎన్నికవుతాడని, ఎన్నిక కావాలని అందరూ భావించారు. అయితే ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. కానీ, ఆయన్ని లక్ మరోరకంగా వరించింది. ఐపీఎల్ కోసం ఆయన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గత ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్ రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడాడు. ఈసారి రాయల్ ఛాలెంజెర్స్ యువరాజ్‌కి పెద్ద డిమాండ్ ఏముందిలే అనుకుని అతన్ని వదులుకుంది. అయితే అనూహ్యంగా అతని కోసం అనేక ఐపీఎల్ సంస్థలు పోటీ పడటంతో మళ్ళీ తాను కూడా వేలంలోకి దిగింది. గతంలో చెల్లించిన మొత్తంకంటే ఎక్కువ మొత్తానికి... అంటే 12 కోట్ల రూపాయలకు యువరాజ్‌ని కొనాలని ప్రయత్నించింది. అయితే హోరాహోరీగా జరిగిన వేలంలో యువరాజ్ సింగ్ 16 కోట్ల రూపాయలకు ఢిల్లీకి సొంతమయ్యాడు.