పాకిస్థాన్ లో అంతర్జాలం బంద్..!?
posted on Jul 1, 2022 @ 11:15AM
పాకిస్థాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోనున్నాయి. ఇదేదో ఉగ్రవాద చర్యల వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య అనుకునేరు.. లేదా ఘర్షణ ల వ్యాప్తికి యంత్రాగం తాత్కాలికంగా చేపట్టిన చర్య కూడా కాదు. ఆర్థిక ఇబ్బందుల్లో నిండా మునిగిన దేశం అతి వేగంగా శ్రీలంక సంక్షోభం స్థాయికి వెళ్లిపోతున్నది. అయితే ఇంకెన్ని రోజులలో పాకిస్థాన్ లో శ్రీలంకలోని పరిస్థితులు ఏర్పడతాయన్నది ఇతమిద్థంగా చేపలేం కానీ.. ఆ పరిస్థితి మాత్రం ఖాయమంటున్నారు పరిశీలకులు, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు.
ఇక విషయానికి వస్తే పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దానికి తోడు నిండా ముంచేస్తున్న అప్పులు. దీంతో ఆ దేశంలో కనీవినీ ఎరుగని విద్యుత్ సంక్షోభం నెలకొంది. అందుకు కారణం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎల్ఎన్జీ కొనలేని స్థితిలో ఆ దేశం ఉండటమే. దీంతో పాకిస్తాన్ విపరీతంగా విద్యుత్ కోత విధిస్తోంది. విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు పనిగంటలను తగ్గించింది, కరాచీతో పాటు ఇతర నగరాల్లో షాపింగ్ మాల్స్, కర్మాగారాలు తెరిచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించేసింది.
విద్యుత్ అవసరం లేని సమయాలలో మాత్రమే మార్కెట్లు పని చేయాలని ఆదేశాలూ జారీ చేసింది. ఇక తరువాతి వంతు అంతర్జాలానిదే అని చెబుతున్నది. విద్యుత్ కొరత కారణంగా మొబైల్ నెట్వర్క్, ఇంటర్ నెట్ సేవల నిలిపివేత ఇంకెంతో దూరంలో లేదని ఆ దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు ట్వీట్ చేసింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంధన దిగుమతి కోసం ఖతార్ తో సంప్రదింపులు జరుపుతోంది. ఆ సంప్రదింపులు ఎంత వరకూ ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ఒక వేళ అవి ఫలవంతం కాకపోతే పాకిస్థానీయులు ఇంటర్నెట్ కు దూరం కావలసిందే. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ రెండంకెలకు చేరుకుంది. ప్రజలు దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం నుంచి పాక్ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.