కాళేశ్వరంపై విచారణ స్పీడప్.. హైదరాబాద్ లోనే జస్టిస్ పినాకి చంద్రఘోష్ మకాం!
posted on Aug 16, 2024 @ 10:17AM
కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాకరంగా చెప్పుకుంటుంటే... ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు అవకతవకల, అవినీతి మయం అని ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో నే కాళేశ్వరం ఎత్తిపోతలలో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ ను వేసింది. ఆ విచారణ కమిషన్ కాళేశ్వరం విచారణకు వేగవంతం చేసింది. ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘఘోష్ శుక్రవారం (ఆగస్టు 16) హైదరాబాద్ చేరుకున్నారు.
విచారణను స్పీడప్ చేసే ఉద్దేశంతో ఆయన రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. అంతే కాకుండా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ నివేదికను పదే పదే కోరినా ఇవ్వకుండా జాప్యం చేయడంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(వీ అండ్ ఈ) డైరెక్టర్ జనరల్‌తో పాటు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై నివేదిక ఇవ్వనందుకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) చైర్మన్‌కు కూడా సమన్లు జారీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయా సంస్థలు నివేదికలు అందించాలని ఇప్పటికే పలు దఫాలుగా కోరినా ఫలితం లేకపోవడంతో వారిని పిలిపించి విచారించాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. అలాగే విచారణలో భాగంగా అఫిడవిట్లు దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు సర్వీసులో ఉన్న సీనియర్ ఐఏఎస్ లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బావిస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై కూడా దృష్టి సారించనుంది. మూడు ఆనకట్టల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే.