21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ గా మళ్లీ మన సుందరి..
posted on Dec 13, 2021 @ 10:10AM
విశ్వసుందరి 2021 కిరీటం మరోసారి భారత యువతికే దక్కింది. పంజాబ్కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు ఈ సారి మిస్ యూనివర్స్గా విజయబావుటా ఎగరేసింది. భారతదేశానికి ఇది మూడో మిస్ యూనివర్స్ కిరీటం. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో అందగత్తె మిస్ సౌతాఫ్రికా దివా, మిస్ పరాగ్వేతో హర్నాజ్ సంధు తలపడింది. ఆ ఇద్దరు అందగత్తెలపై ఆధిక్యం సాధించిన మన మిస్ హర్నాజ్ సంధు విశ్వ సుందరిగా నిలిచింది. ఈ పోటీలో మిస్ పరాగ్వే నదియా ఫెరీరా ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. మిస్ సౌతాఫ్రికా లాలెలా మస్వానే రెండో రన్నరప్ సాధించింది. ఫిలిప్పీన్ సుందని బీట్రైస్ గోమెజ్ ఈసారి విశ్వసుందరి పోటీల్లో టాప్ 5 ప్లేస్లో ఉంది.
1994లో సుస్మితాసేన్, 2000 సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్గా కిరీటాన్ని అందుకున్నారు. 21 ఏళ్లకు ఇప్పుడు మిస్ యూనివర్స్ కిరీటాన్ని మన దేశానికి హర్నాజ్ కౌర్ సంధు సంపాదించిపెట్టడం విశేషం. హర్నాజ్ కౌర్ సంధుకు ఈసారి జరిగిన 70వ విశ్వసుందరి కిరీటాన్ని అందించేందుకు అడిగిన ప్రశ్న.. వాతావరణ మార్పు ఓ బూటకం అంటుంటారు. మీ సమాధానం ఏమిటి అని అడిగితే.. ‘ప్రకృతిలో చాలా సమస్యలున్నాయని తెలిసి.. తన గుండె పగిలిపోతోందని బదులిచ్చింది. ఇదంతా బాధ్యతా రాహిత్యం వల్లే జరుగుతోందనే అభిప్రాయం హర్నాజ్ వ్యక్తం చేసింది. మనం చేసే ప్రతి చర్యా ప్రకృతిని రక్షించగలద’ని హర్నాజ్ సమాధానం చెప్పింది. ఆమె సమాధానంతో సంతృప్తి చెందిన కమిటీ హర్నాజ్ను ఈ ఏడాది విశ్వసుందరిగా ప్రకటించడంతో ఆనందంతో కన్నీరు కార్చింది.
మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలిచే వరకు ఈ 21 ఏళ్ల బ్యూటీ హర్నాజ్ కౌర్ సంధు ప్రయాణం అంత సులువగా ఏమీ సాగలేదు. ఇంతకు ముందు హర్నాజ్ ఎన్నో హేళనలు, అవమానాలు ఎదుర్కొంది. స్కూల్లో తోటి విద్యార్థులు తనపై చేసే కామెంట్స్ భరించింది. తనను తాను నిరూపించుకునేందుకు చేసిన ప్రయాణంలో హర్నాజ్కు దక్కిన విజయమే మిస్ యూనివర్స్ కిరీటం.
చిన్నప్పుడు బక్కపలచగా, గాలి వీస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉండేది హర్నాజ్ సంధు. హేళనలు భరించలేక ఒక్కోసారి సిగ్గుతో తలదించుకుని ఒంటరిగా గడిపేందుకు అలవాటు పడింది. అయితే.. హర్నాజ్కు ఆమె కుటుంబం మొత్తం అండగా నిలబడింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో 17 ఏళ్ల వయస్సులోనే మోడలింగ్ రంగంలో హర్నాజ్ అడుగుపెట్టింది. ఒక పక్కన పంజాబీ సినిమాల్లో నటిస్తూనే అందాల పోటీల్లోనూ పాల్గొనేది. 2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్ 12లో నిలిచిన హర్నాజ్ కౌర్ సంధు ఇప్పుడు ఏకంగా మన జాతి యావత్తు గర్వపడేలా మూడో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది.
చండీగఢ్లోని పంజాబీ ఫ్యామిలీలో 2000వ సంవత్సరంలో హర్నాజ్ కౌర్ సంధు పుట్టింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్య ముగించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. చిన్నప్పటి నుంచీ ఫిట్నెట్పై దృష్టిపెట్టిన హర్నాజ్ గుర్రపు స్వారీ, ఈత కొట్టేది.. డ్యాన్స్ చేసేది.. నటించేది.. ప్రయాణాలంటే ఈ విశ్వసుందరికి ఎంతో ఇష్టం. హర్నాజ్ సంధు సోషల్ మీడియాలో చాలా ఎక్కువ మంది పాలోవర్స్ను సంపాదించుకుంది. ఈ సారి తప్పకుండా విశ్వ సుందరి కిరీటం సాధించి సుస్మితా సేన్, లారా దత్తాల సరసన స్థానం సంపాదిస్తానని పోటీలకు ముందే చెప్పగలిగిన ధీశాలి హర్నాజ్ కౌర్ సంధు. మిస్ యూనివర్స్గా నిలిచిన హర్నాజ్ కౌర్ సంధును పలువురు అభినందనలతో ముంచెత్తున్నారు