చైనాను వదిలే కంపెనీలకు ఇండియా బంపర్ ఆఫర్!
posted on May 8, 2020 @ 12:04PM
కరోనా కారణంగా చైనాను వదిలి వెళ్లాలనుకుంటున్న కంపెనీలను ఆకట్టుకోవడానికి మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్‌లను ఇస్తోంది. కొన్నింటికి ఇప్పటికే భారత్‌లో ఉనికి ఉంది. అలాంటి వారు పూర్తిగా చైనా నుండి ఇక్కడకు తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి. గత నెలలోనే వెయ్యికి పైగా అమెరికా కంపెనీలను దైత్య అధికారుల ద్వారా భారత్ సంప్రదించింది. అక్కడి నుంచి వచ్చే కంపెనీలకు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇస్తామని భారత్ భరోసా ఇస్తోంది. పన్నులు, కార్మిక చట్టాలు, భూసేకరణ నిబంధనలను మరింత సులభతరం చేయనుంది.
చైనా నుండి విదేశీ కంపెనీలు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో భారత్ ఆ కంపెనీలకు గాలం వేస్తోంది. ఇందులో మొబైల్, టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్ సంస్థలు ఉన్నాయి. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాల సంస్థలు కూడా భారత్‌ను ఎంచుకుంటున్నాయి. గత సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ పన్నును మోడీ ప్రభుత్వం 25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా విదేశీ కంపెనీలు రావడానికి కలిసి వస్తోంది. కొత్త తయారీ సంస్థలపై పన్నును 17 శాతం మాత్రమే విధిస్తున్నట్లు కూడా ప్రకటన చేసింది మోడీ ప్రభుత్వం. జీడీపీలో 15 శాతంగా ఉన్న తయారీ రంగం వాటాను 2022 నాటికి 25 శాతానికి పెంచాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.