హిందూ మహాసముద్రంపై అధిపత్య యత్నాలు
posted on Aug 25, 2020 @ 3:37PM
హిమాలయాల వద్ద మోహరింపులు
హిందూ మహాసముద్రంపై అధిపత్య యత్నాలు
చైనా ఎత్తులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా భారత్
హిమాలయాల్లో భారత్ చైనా సరిహద్దుల్లో లఢఖ్, గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ వెంట సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీ కవ్వింపు చర్యలకు హిమాలయాల్లో గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్న భారత సైన్యం సాగరతలంలోనూ సత్తా చాటేందుకు సమాయత్తం అవుతోంది. తాజాగా డ్రాగన్ కంట్రీ మయన్మార్, పాకిస్తాన్, ఇరాన్‌లలో ఓడరేవుల ద్వారా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతోంది. ఈ క్రమంలో చైనా దూకుడుకు తగిన పాఠం చెప్పడానికి భారత సైన్యం కూడా దేశ ద్వీప భూభాగాల్లో నౌవికా, వైమానిక, సైనిక దళాలను మోహరిస్తోంది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఉత్తర అండమాన్‌లోని ఐఎన్‌ఎస్ కోహస్సా, షిబ్‌పూర్ , నికోబార్‌లోని క్యాంప్‌బెల్ స్ట్రిప్ వద్ద ఎయిర్‌స్ట్రిప్‌ను ఇప్పటికే పూర్తి స్థాయి యుద్ధ స్థావరాలుగా భారత్ అభివృద్ధి చేస్తుంది. వీటితో పాటు లక్షద్వీప్‌లోని అగట్టి వద్ద ఉన్న ఎయిర్‌స్ట్రిప్ ను సైనిక కార్యకలాపాల కోసం అభివృద్ధి చేస్తున్నారు. భారత్ కు సహాయంగా అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన బి - 2 స్పిరిట్ బాంబర్లు మూడు హిందూ మహాసముద్రంలోని డియోగో గార్పియా నౌకాకేంద్రానికి ఇప్పటికే చేరుకున్నాయి. 2020 ప్రారంభంలోనే ఇక్కడికి అమెరికా బి-52 హెచ్ ఫైటర్ జెట్లు ఆరు చేరుకున్నాయి.
బంగాళాఖాతం నుంచి మలక్కా స్ట్రెయిట్స్ వరకు, అరేబియా సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్ వరకు నౌవికాదళాన్ని సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక్కడ గస్తీ మరింత పెంచారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాలు ఈ రెండు ద్వీపాలలోనే ఉన్నాయి.
చైనా యుద్ధానికి సిద్ధమై భారత్ తో తలపడితే భూ, గగన, సాగర తలాల్లో ఎలా వచ్చినా డ్రాగన్ కంట్రీకి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉంది.