స్పుత్నిక్-v వ్యాక్సిన్ పై కలిసి పని చేయబోతున్న ఇండియా, రష్యా..!
posted on Aug 26, 2020 @ 10:51AM
ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ను సిద్ధం చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా వ్యాక్సిన్ "స్పుత్నిక్-v"పై భారత్ ఆసక్తి చూపడంతో రష్యా ప్రభుత్వం వెంటనే ఆ వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని మన ప్రభుత్వం తో పంచుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన రాజేష్ భూషణ్, "స్పుత్నిక్- వ్ వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలకు సంబంధించి రష్యా భారత్ కు వివరాలు అందించింది" అని అన్నారు. ప్రస్తుతం ఆ వివరాలు పరిశీలిస్తున్నామని, అక్కడ జరుగుతున్న ఆఖరి దశ ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. అయితే దాని భద్రత, ప్రభావానికి సంబంధించి వివరాలు ఇంకా అందాల్సి ఉందని తెలుస్తోంది.
ఈ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లోని రష్యా రాయబారి కేంద్ర బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, ఐసీఎమ్ఆర్ డీజీ బలరామ భార్గవ్ తో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా భారత్ లో వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ తో పాటు ఉత్పత్తికి అనుమతి పొందేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ కూడా స్వయంగా గతంలో వెల్లడించారు.