టీడీపీ నేతల గ్రానైట్ లీజుల రద్దు.. వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం
posted on Aug 26, 2020 @ 10:51AM
అధికారంలోకి వచ్చాక పలువురు టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ.. మాట వినకుంటే టీడీపీ నేతలపై ఉక్కుపాదం మోపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలను టార్గెట్ చేసిన వైసీపీ సర్కారు.. తాజాగా ప్రకాశం జల్లాలో టీడీపీ నేతలకు చెందిన గ్రానైట్ క్వారీలను మూసివేయించడం తీవ్ర కలకలం రేపుతోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా గనులశాఖ ఈ క్వారీలను మూయించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్రంలో గ్రానైట్ క్వారీలకు ప్రకాశం జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి దేశ విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే, జిల్లాలో గ్రానైట్ వ్యాపారంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులపై కొన్ని నెలల కిందట నుంచి వేధింపుల పర్వం మొదలైందన్న ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు గొట్టిపాటి రవికుమార్, శిద్ధా రాఘవరావు, పోతుల రామారావుకు చెందిన క్వారీల్లో గ్రానైట్ నిక్షేపాల వెలికితీతకు పర్మిట్లు నిలిపేసారు. ఈ వేధింపులు భరించలేకే శిద్దా రాఘవరావు వైసీపీలో చేరిపోయారని చెబుతారు. అందుకుతగ్గట్టే అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన గ్రానైట్ వ్యాపారం సాఫీగా సాగుతోంది. కానీ గొట్టిపాటి, పోతులకు చెందిన క్వారీలపై మాత్రం ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. పర్మిట్ల నిలిపివేతపై హైకోర్టును ఆశ్రయించి వీరిద్దరూ అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ద్వారా నోటీసులు ఇప్పించి.. పర్మిట్లు నిలిపివేయించింది. దీన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. వారి క్వారీల్లోని నిక్షేపాల విక్రయాలకు పర్మిట్లు ఇవ్వాలని ఆదేశించింది. అయినా వాటిని ఇప్పటివరకూ ప్రభుత్వం లెక్క చేయలేదు. దీనిపై తిరిగి హైకోర్టుకు వెళ్లేందుకు రవికుమార్, రామారావు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చివరికి క్వారీయింగ్ లోపాల పేరుతో వాటిని ఏకంగా మూత వేయించింది ప్రభుత్వం.
ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల గ్రానైట్ లీజులు రద్దు చేయడం వైసీపీ కక్ష సాధింపు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పలుచోట్ల టీడీపీ నేతలపైనా, సోషల్ మీడియా కార్యకర్తలపైనా అక్రమ కేసులు పెడుతున్నారని, వేధింపులకి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.