పాకిస్తాన్ తీరు ఎన్నటికీ మారదేమో?
posted on Aug 20, 2015 9:24AM
భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు నెహ్రూ నుండి మోడీ వరకు అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ సఫలం కాలేకపోతున్నారు. అందుకు వారి ప్రయత్నలోపం ఏమీ లేదు. వారు ఎంత చిత్తశుద్దిగా ప్రయత్నిస్తున్నా సైన్యం, ఉగ్రవాదులు పాక్ ప్రభుత్వంపై పరోక్షంగా పెత్తనం చేస్తున్న కారణంగా పాక్ ప్రభుత్వం భారత్ కు సహకరించడం లేదనేది పదేపదే రుజువవుతూనే ఉంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత భారత్-పాక్ సంబంధాలను పునరుద్దరించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేసారు. కానీ పాక్ ని మార్చడం ఆయన వల్ల కూడా కాలేదు. అయినప్పటికీ పాక్ తో సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి తన ప్రయత్నాలు మానుకోలేదు. అందుకే కొన్నిరోజుల క్రితం రష్యాలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు. మోడీ ప్రయత్నం కొంత ఫలించడంతో త్వరలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల డిల్లీలో సమావేశం జరుగబోతోంది. కానీ పాక్ ప్రభుత్వం తన తీరు ఎన్నటికీ మారబోదని మరోమారు స్పష్టం చేస్తోంది.
పంజాబ్, జమ్మూలలో ఉగ్రవాదుల దాడులు, కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలపై గత రెండు వారాలుగా పాక్ దళాలు బాంబుల వర్షం కురిపిస్తుండటం, పాక్ స్వాతంత్ర దినోత్సవ సనదర్భంగా ఆగస్ట్ 14న డిల్లీలో పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ గురించి అసందర్భ ప్రేలాపనలు వంటివెన్నో యధాప్రకారం జరిగిపోతూనే ఉన్నాయి. పైగా భారత్ దళాలే 78సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్ సరిహద్దు భద్రతా దళాలపై, గ్రామాలపై దాడులు చేస్తున్నాయని అబ్దుల్ బాసిత్ ప్రకటించడం మొగుడ్ని కొట్టి బజారు కెక్కినట్లుంది. ఒకవైపు శాంతి, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరుచుకొనేందుకు చర్చలకు సిద్దం అంటూనే మరో వైపు ఈవిధంగా వ్యవహరించడం కేవలం పాక్ కే చెల్లు. అయినప్పటికీ భారత్ చాలా సహనంతోవ్యవహరిస్తూ డిల్లీలో జరుగబోయే జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి సిద్దపడుతోంది.
పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ ఇటీవల సజీవంగా పట్టుబడటం, పంజాబ్, ఉదంపూర్ లలో ఉగ్రవాదుల దాడులు, సరిహద్దుల వద్ద కాల్పులకు ఈ సమావేశంలో పాక్ జాతీయ భద్రతా సలహాదారు తప్పనిసరిగా భారత్ కు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అది చాలా కష్టం అని పాక్ కూడా తెలుసు. అందుకే భారత్ ఈ సమావేశాన్ని కూడా తనంతట తాను ఏకపక్షంగా రద్దు చేసుకొనేలా తనకు అలవాటయిన వ్యూహాలను అమలు చేస్తోంది.
ఇంతకు ముందు భారత ప్రభుత్వం వారిస్తున్నా లెక్క జేయకుండా పాక్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీరీ వేర్పాటువాదులయిన హురియత్ నేతలను డిల్లీకి ఆహ్వానించి వారితో సమావేశమయ్యారు. అందుకు నిరసనగా గతేడాది ఇస్లామాబాద్ లో జరగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకొంది. కనుక కీలకమయిన ఈ సమావేశం రద్దు చేసేందుకు మళ్ళీ పాక్ హైకమీషనర్ అదే ఎత్తు వేస్తున్నారు. వచ్చే సోమవారంనాడు పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో డిల్లీలో సమావేశం కానున్నారు. దానికి ఒక్కరోజు ముందు అంటే ఆదివారంనాడు సర్తాజ్ అజీజ్ డిల్లీ చేరుకొంటారు. ఆరోజు రాత్రి ఆయనతో కాశ్మీరీ వేర్పాటు హురియత్ నేతలు సయీద్ అలీ షా గిలానీ తదితరుల విందు సమావేశం ఏర్పాటు చేసారు. ఇది భారత్ ని రెచ్చగొట్టే ప్రయత్నమేనని అర్ధమవుతోంది.
ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగబోతున్న సమయంలో హురియత్ వేర్పాటువాద నేతలను డిల్లీకి ఆహ్వానించడమే పెద్ద తప్పు. మళ్ళీ వారికి పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తో విందు సమావేశం ఏర్పాటు చేయడం దానికి ఆయన అంగీకరించడం అన్నీ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న తప్పులే. ఆ విధంగా భారత్ ని మళ్ళీ రెచ్చ గొట్ట గలిగితే ఈ సమావేశాన్ని భారత్ రద్దు చేసుకొంటుందని పాక్ వ్యూహంగా కనబడుతోంది. తద్వారా భారత్ అడగబోయే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన ఇబ్బందికరమయిన పరిస్థితులను తప్పించుకోవడమే కాకుండా, శాంతి ప్రయత్నాలకు తమ ప్రభుత్వం ముందుకు వస్తున్నప్పటికీ భారత్ కుంటిసాకులు చెప్పి తప్పించుకొంటోందని భారత్ ని అంతర్జాతీయ వేదికల మీద నిందించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పాక్ ఈ కీలకమయిన సమావేశాన్ని రద్దు చేసేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండవచ్చును.
పాక్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశ్యంతోనే భారత్ ఈ సమావేశానికి సిద్దపడుతుంటే, అంతర్జాతీయ సమాజం ముందు తను దోషిగా నిలబడకూదదనే ఉద్దేశ్యంతోనే పాక్ ఈ సమావేశానికి అంగీకరించింది. కానీ దానిని ఏదోవిధంగా చెడగొట్టి భారత్ పైనే ఆ నింద వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కనుక ఈ సమావేశం జరిగేలోగా సరిహద్దులలో దాడులు మరింత ఉదృతం చేయవచ్చును. లేదా భారత్ లో జొరబడిన పాక్ ఉగ్రవాదులు ఎక్కడయినా బాంబులు పేల్చ వచ్చును. లేదా సరిహద్దులలో మళ్ళీ పాక్ ఉగ్రవాదులు దాడులు చేయవచ్చును. జమ్మూలో పాక్, ఐ.యస్. జెండాలు రెపరెపలాడించవచ్చును. హురియత్ నేతలు భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేయవచ్చును.
పాక్ సృష్టించబోయే ఇన్ని సవాళ్ళను ఎదుర్కొని ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచి వాటిని దృడ పరచాల్సిన గురుతరమయిన బాధ్యత పాక్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ మీద ఉంది. కానీ ఆయన వాటిని మరింత చెడగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఆదేశాలు, సిద్దాంతాల ప్రకారమే ఆయన ఆపని చేస్తున్నాడని వేరేగా చెప్పనవసరం లేదు. అటువంటప్పుడు ఈ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాలు నిర్వహించడం కూడా వ్యర్ధమే. ఒకవేళ ఈ సమావేశం జరిగినా దానిలో భారత్-పాక్ ఒకదానినొకటి నిందించుకోవడం తప్ప మరేమీ చేయలేవు. ఎందుకంటే కడుపులో లేనిదీ కావలించుకొంటే రాదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.