ఏపీ కోసం నిజాయితీగా పనిచేస్తున్నదెవరు?
posted on Aug 21, 2015 @ 9:45AM
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకి ఏపీ ప్రజలే కాదు తెలంగాణా ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో ఘోర పరాజయం పొందింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా చేసిన రాష్ట్ర విభజన కారణంగా ఏడాదిన్నర కాలం గడుస్తున్నా ఇంకా రెండు రాష్ట్రాలు గొడవలు పడుతూనే ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో తిరుగుతూనే ఉంది.
“కాంగ్రెస్ చేసిన ఈ పనివల్ల ఇక రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్ లేదని, ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా పార్టీని ప్రజలు పట్టించుకోవడం మానేశారని” కాంగ్రెస్ నేతలే స్వయంగా చెప్పుకొంటూ పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. ఇందంతా చూస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పశ్చాతాపం కనబరచకపోగా నేటికీ రాష్ట్ర విభజన చేయడమేదో గొప్ప ఘనకార్యంలా చెప్పుకొంటోంది. అందుకే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరింత వేగంగా క్షీణిస్తోంది. కాంగ్రెస్ ఎలాగ పోయినా ఎవరూ బాధపడేవాళ్ళు లేరు. కానీ రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించి మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేయడాన్ని అందరూ తప్పు పడుతున్నారు.
కాంగ్రెస్, వైకాపాలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని పైకి చెప్పుకొంటున్నప్పటికీ, అవి తమ పార్టీల ఉనికిని కాపాడుకొని బలోపేతం చేసుకోవడానికి, తమ రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీలను ఇరుకునపెట్టి అప్రదిష్టపాలు చేయడానికే ఈ అంశాన్ని వాడుకొంటున్నాయని అందరికీ తెలుసు. ఆ ప్రయత్నంలో అవి కేంద్రప్రభుత్వాన్ని, తనను తరచూ నిందింస్తుండటంతో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నిన్న వాటికి చాలా ఘాటుగా జవాబిచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటులో ఏవిధంగా వ్యవహరించిందో ఆయన మళ్ళీ గుర్తు చేసి, ఆనాడు సభలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రం కోసం గట్టిగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలేవయినా ఉంటే అవన్నీ తన ఒత్తిడి వల్లనే ఇచ్చిందని అన్నారు. అధికారం, ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేసే కాంగ్రెస్ నేతలా...తనను ప్రశ్నించేది? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ వలన రాష్ట్రానికి అరిష్టమే తప్ప ఎటువంటి లాభం జరగదని, కానీ తను రాష్ట్రం నుండి ఎన్నిక కాకపోయినా రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నాని అన్నారు. తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకు వస్తున్నానని కానీ కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ మొదలయిన అంశాల మీద కేంద్రంపై తను నిరంతరం ఒత్తిడి చేస్తున్నానని, వాటిపై కేంద్రప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.
ప్రత్యేక హోదా గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ ఐదేళ్ళు ఇస్తానంటే ఐదేళ్ళు కాదు కనీసం పది లేదా పదిహేనేళ్ళయినా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని వెంకయ్య నాయుడు ప్రాదేయపడ్డారు. ప్రతిపక్షాలు అదే విషయాన్ని మరో కోణంలో నుండి చూపిస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి తప్ప ఆనాడు ఆయన ఒక్కడే గట్టిగా మాట్లాడారన్న విషయాన్నీ అంగీకరించడం లేదు. వెంకయ్య నాయుడు అదే విషయాన్ని నిన్న గట్టిగా చెప్పి తనను విమర్శిస్తున్న ప్రతిపక్షాల నోళ్ళు మూయించే ప్రయత్నం చేసారు.
ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు మధ్యలో కొంత సందిగ్దత కనబరిచినప్పటికీ, కేంద్రమంత్రిగా ఉన్న ఆయనే ఆ రెండు పార్టీల కంటే నిజాయితీగా దాని కోసం కృషి చేస్తున్నారు. ఆయనకే ఆ అవకాశం కూడా ఉందని చెప్పవచ్చును. రాష్ట్రానికి ఏదో విధంగా వీలయినంత మేలు చేయాలని ఆయన ఆరాటపడుతుంటే, రాష్ట్రానికి మేలు చేయడం కోసమే తాము ఉద్యమాలు చేస్తున్నామని చెపుతూ కాంగ్రెస్, వైకాపాలు తమ రాజకీయ లబ్ది కోసం పోరాడుతున్నాయి. కానీ ప్రత్యేక హోదా విషయంలో ఇంకా జాప్యం జరుగుతున్నందున వారిదిప్పుడు ఆయనపై పైచెయ్యి సాధించినట్లు కనబడుతోంది. అందుకే రాష్ట్రం కోసం నిజాయితీగా కృషి చేస్తున్న వెంకయ్య నాయుడు వారికి సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తోంది. కానీ ఎల్లకాలం ఈ పరిస్థితి ఇలాగే ఉండబోదనే సంగతి కాంగ్రెస్, వైకాపాలకి కూడా తెలుసు. అందుకే అవకాశం దొరికినప్పుడే దానిని సద్వినియోగపరచుకోవలాని ఆరాటపడుతున్నాయి. కానీ అవి తమ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రం కోసమే నిజాయితీగా పోరాడితే వారికి నిజంగానే ఆ ప్రయోజనం, ప్రజలలో ఆదరణ దక్కేవి.