కమల దళంలో కొత్త నేతలకు పెద్ద పీట
posted on Jan 6, 2023 @ 9:57AM
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ పాతకొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ పూర్తి సమయ కార్యకర్తల సమావేశంలో, పార్టీ మిషన్ 90 టార్గెట్ గా రోడ్ మ్యాప్ సిద్దం చేసిన విషయం తెలిసిందే. సరే నిజంగా బీజేపీ ప్రస్తుతమున్న మూడు సీట్ల నుంచి ఒకేసారి 90 సీట్లకు చేరుకుంటుందా? అది అయ్యే పనేనా అనే విషయాన్ని పక్కన పెడితే, కమల దళం ‘మిషన్ టార్గెట్’ విషయంలో తగ్గేదేలే అంటోంది. పక్కగా ప్రణాళికలను రచించుకోవడమే కాకుండా కార్య క్షేత్రంలో అడుగులు వేయడం ప్రారంభించింది.
అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీరియస్ గా దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ పోలింగ్ బూత్ స్థాయి నుంచి కేడర్ ను పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7,61,200 మంది పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ నెల 7న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వారందరితో వర్చువల్ గా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. తెలంగాణ కోసం బీజేపీ ప్రత్యేకంగా సరళ్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఆ యాప్ లో బూత్ కమిటీల వివరాలు, పార్టీ వ్యవహారాలు పొందుపరచనున్నారు. ఇదిలా ఉంటే ఎంపిక చేసిన పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ బీజేపీ ఐడీ కార్డులతో పాటు డైరీలు అందజేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డైరీలు మెయింటెన్ చేయాలని వారికి ఆదేశించింది.
నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ పరంగా బూత్ స్థాయిలో సమస్యలు, వాటి పరిష్కారానికి చర్యలతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి అన్ని వివరాలు సేకరించాలని కార్యకర్తలకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,600 పోలింగ్ బూత్ లు ఉండగా.. ఒక్కో దానికి 22 మంది కార్యకర్తల్ని నియమించారు. వారిలో ఒకరు సోషల్ మీడియా బాధ్యతలు చూసుకోనున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు.
అదలా ఉంటే, రానున్న రోజుల్లో రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈనెల ( జనవరి) 16, 17 తేదీలలో ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో..పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగించే అంశంతో పాటు, ఈ సంవత్సరం జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావడంపై కూడా లోతుగా చర్చించనున్నారు.
ఎన్నికలే ప్రధాన ఎజెండా జరుగతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, ఇతర రాష్ట్రాలతో పాటుగా ఈ సంవత్సరం చివర్లో జరిగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ‘ప్రత్యేక’ చర్చ ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చే విషయంతో పాటుగా, ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలోనూ నాయకులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షునిగా కొనసాగిస్తూ, ఈటలకు పదోన్నతి కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ కు అన్ని విధాల సమ ఉజ్జీగా నిలిచి, కేసీఆర్ శక్తియుక్తులను సమర్ధవంతంగా ఎదుర్కోగల సత్తా సామర్ధ్యం ఉన్న ఈటల రాజేందర్ కు పార్టీలో సీఎం స్థాయి హోదాను కల్పిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అటు తెలంగాణ ఉద్యమ నేతల్లో, ఇటు బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మంచి పటున్న ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తెర మీదకు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించక పోవచ్చును కానీ, పార్టీ నేతలకు క్లారిటీ అయితే ఇస్తారని, అంటున్నారు. ఏది ఏమైనా, ఈటలతో పాటుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కొందరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఖాయంగా ఉందని అంటున్నారు.