డబ్బులు డబుల్ చేస్తానంటూ రూ.25 లక్షల మోసం

 

హైదరాబాద్ నగరంలో జరిగే కొన్ని వింత వింత ఘటనలు చూస్తూ ఉంటే...ఎక్కడి నుండి వస్తాయా ఈ ఆలోచనలు అని అనిపిస్తుంది. మోసం చేయడానికి పలుమార్గాలు మంచి మార్గంలో వెళ్లడానికి ఒకే మార్గం... అన్నట్లు గా మోసగాళ్లు పలు మార్గాలను ఎంచుకొని మోసాలకు పాల్పడుతూ ఉంటారు. టెక్నాలజీ ఎంతగా పెరిగినా కూడా కొంతమంది మూఢ నమ్మకాలను నమ్మి.. మోసపోతూ ఉంటారు.

భాగ్య నగరంలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది... గురువు రూపంలో వచ్చిన ఒక వ్యక్తి భారీష్ పేరుతో డబ్బులు డబుల్ చేస్తా నంటూ ఓ అమాయకుడిని నమ్మించి బురిడీ కొట్టించాడు. అతని వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది..

వివరాల్లోకి వెళితే...

నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ (44) అనే వ్యక్తి హైదరాబాదు నగరానికి వచ్చి బహదూర్పుర పరిధిలో నివాసం ఉంటూ సోఫా వర్క్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన గుగోలోత్ రవీందర్ (40) అనే వ్యక్తి హైదరాబాదు నగరానికి వచ్చి ఫిలింనగర్ లో ఉంటూ మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. 

మేడ్చల్ జిల్లాకు చెందిన కవీర సాయిబాబా (41) కొరియర్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. మనోహర్ సింగ్ (39) ధోబి గా పని చేస్తున్నాడు. వీళ్ళందరికీ అబ్దుల్ ఖయ్యూమ్ గురువు.... వీరందరూ అమాయకులైన మరియు ఒంటరిగా ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. 

ముందుగా ఈ నిందితులు అమాయకులను గుర్తించి బారిష్ పూజ చేస్తే మీ వద్ద ఉన్న డబ్బులు డబుల్ అవుతుం దని నమ్మించి... వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు... ఈ తరుణంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కుకున్నాడు... ఒంటరిగా ఉన్న బాధితుడిన్ని టార్గెట్ గా చేసుకొని బారిష్ పూజ చేస్తే డబ్బులు అనేక రేట్లు పెరుగుతుందని నమ్మించారు. వీరి మాటలు నిజమని నమ్మిన బాధితుడు పూజకు సరైనని ఒప్పుకున్నాడు. 

తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో అబ్దుల్ ఖయ్యూమ్ గురువు గా పరిచయం చేస్తూ ఈ ఐదుగురు నిందితులు.... బాధితుడు ఇంటికి వెళ్లి బారిష్ పూజ చేసి అనంతరం బాధితుడికి స్వీట్లు మరియు బాదం పాలు ఇచ్చారు... మత్తు కలిపిన బాదంపాలు ప్రసాదంగా స్వీకరించిన తర్వాత సదరు బాధితుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. 

అదే సమయంలో నిందితులు బాధితుడి వద్ద ఉన్న రూ. 25 లక్షల రూపాయలను తీసుకొని అక్కడి నుండి పారిపో యారు. స్పృహ వచ్చిన బాధితుడు చూసేసరికి గురువుతో పాటు శిష్యులు కూడా అక్కడ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగించారు. 

నిన్న సాయంత్రం సమయంలో గండి మైసమ్మ వద్ద మహమ్మద్ ఇర్ఫాన్, రవీందర్, సాయి బాబా, ఠాకూర్ మనోహర్ సింగ్ లను అరెస్టు చేసి... వారి వద్ద నుండి ఒక గన్, కత్తి, రూ. 8,50,000 స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారి అయిన అబ్దుల్ ఖయ్యూమ్ పరారీ లో ఉన్నాడు. 

అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని మేడ్చల్ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డి వెల్లడించారు...డబ్బులు ఎప్పుడు కూడా డబుల్ కావు.. అటువంటి పూజలే ఉండవు... ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఎలా మోసపోతున్నారు. ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

హైకోర్టుకు రకుల్ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్

  హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు...ఈ నేపథ్యంలోనే పోలీసులు మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించగా అందులో హీరోయిన్ సోదరుడు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో అమన్‌ను ఏ7 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసు నమోదు అయిన నాటి నుంచి  అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగదారుడిగా (డ్రగ్స్ కన్స్యూమర్) అమన్‌పై ఆరోపణలు ఉన్నాయి.  ఇదే కాకుండా, ఇది అమన్‌పై నమోదైన రెండో డ్రగ్స్ కేసు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా మరోవైపు అమన్ ప్రీతిసింగ్ డ్రగ్స్ కేసులో తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీతిసింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సహా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చారని, ప్రత్యక్ష ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని అమన్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.కేవలం ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా తనపై కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.  అంతేకాకుండా,  తాను  డ్రగ్స్ కన్స్యూమర్ అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని అమన్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో కీలక అంశాలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని పోలీసులను కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుం టున్న నేపథ్యంలో, సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి డ్రగ్స్ కేసులో చిక్కుకు న్నాడని  తెలియడంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

మరోసారి లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్...తప్పుడు రాతలపై పరువునష్టం దావా

  జగన్ మీడియా తప్పుడు రాతలపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌కి మంత్రి నారా లోకేష్ 7వ తేదీన (బుధవారం) హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్స్‌ పూర్తికాగా, 3వ సారి లోకేష్‌ హాజరవుతున్నారు. చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి` శీర్షికతో 2019, అక్టోబర్‌ 22న జగన్ మీడియాలో అసత్యాలు, కల్పితాలతో ఓ కథనం ప్రచురించారు. అవాస్తవాలతో, ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఈ కథనం ప్రచురించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన న్యాయవాదుల ద్వారా  ఆపత్రికకి రిజిస్టర్‌ నోటీసు పంపించారు.  అయినప్పటికీ జగన్ మీడియా  ఎటువంటి సహేతుకమైన సమాధానం ఇవ్వనందున  లోకేష్‌ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం ప్రచురించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని  ప్రచురించిన తేదీల్లో అసలు విశాఖలోనే లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్‌ పోర్ట్‌లో ఎటువంటి ప్రొటోకాల్‌ సౌకర్యాలు స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో మంత్రి లోకేష్‌ తరపున సీనియర్‌ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు, ఎస్వీ రమణ హాజరవుతున్నారు.

టీమ్ వర్క్...బెటర్ రిజల్ట్స్...ఇవే అభివృద్ధి మంత్రం : సీఎం చంద్రబాబు

  2025వ సంవత్సరంలో మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026లోనూ అదే ఉత్సాహం, వేగంతో పనిచేసి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో మొత్తం 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.8,74,705 కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందగా, 8,35,675 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. సమావేశం ప్రారంభానికి ముందు మంత్రులు, సీఎస్ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తిరిగి బలపడిందని, గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. చిన్న పొరపాటుకైనా తావివ్వకుండా బాధ్యతతో పనిచేయాలని మంత్రులు, అధికారులను కోరారు. ప్రజలపై భారం తగ్గించాం… సంతోషంగా ఉంది విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు చేపట్టామని సీఎం తెలిపారు. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, రూ.4,500 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించిందన్నారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.3.70కి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ చర్యల వల్లే డేటా సెంటర్లు, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయగలిగామని, గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి రావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఎం ప్రశంసించారు. వేగవంతమైన గవర్నెన్స్‌తో ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఐలాండ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. 15 కిలోమీటర్ల క్లీన్ బీచ్ ఫ్రంట్, కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, మాల్దీవ్స్ తరహాలో ఐలాండ్ టూరిజాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పాపికొండలు–పోలవరం, కోనసీమ, పులికాట్, విశాఖ, అరకు, గండికోట వంటి ప్రాంతాలను క్లస్టర్ టూరిజంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతులకు లాభం తిరుపతి ప్రాంతంలో మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని సీఎం చెప్పారు. వాల్యూ అడిషన్‌తోనే రైతులకు గరిష్ట లాభం దక్కుతుందన్నారు. ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఛాంపియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలసీల అమల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవద్దని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్, స్పేస్ సిటీ, మాకవరపాలెం ఫుడ్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఎస్ఐపీబీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏపీ ఐటీ ఇన్‌ఫ్రా పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు, సీఎస్ విజయానంద్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

చంద్రబాబుతో మహేంద్రసింగ్ ధోనీ భేటీ.. ఎందుకో తెలుసా?

భారత క్రికెట్ దిగ్గజం, టీమ్ ఇండియా మాజీ  కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ   జనవరి 9న  శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సందర్శించనున్నారు. అంతే కాదు ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో భేటీ అవుతారు. ఇప్పుడు ఈ విషయమే రాజకీయ, క్రీడా వార్గాలలో ఆసక్తికర చర్చకు తెరలేపింది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రీడలకు ప్రోత్సాహం  ఇవ్వడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రీడా నగర నిర్మాణం కూడా ఒక భాగం చేసిన సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు ధోనీ చంద్రబాబు భేటీకి అత్యంత ప్రాధాన్యత కలగడానికి కారణమైంది. రానున్న సంవత్సరాలలో  క్రికెట్ అభివృద్ధికీ, యంగ్ క్రికెటర్లలో హిడెన్ టాలెంట్ ను వెలికి తీయడానికి అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో  అమరావతి వేదికగా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకే మహేంద్రసింగ్ ధోనీ చంద్రబాబుతో భేటీ కానున్నారని విశ్వసనీయవర్గాల భోగట్టా.    ఇక ఇప్పటికే అమరావతిలో ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించే యోచనలో ఉన్న చంద్రబాబు ఇప్పటికే ఆ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా బాబూ, ధోనీ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.  ఈ చర్చల సారాంశాన్ని, ఔట్ కమ్ ను బట్టి మిస్టర్ కూల్ ధోనీని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ లలో ఒకరిగా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. దేశంలో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకమైనది. ధోనీ సారథ్యంలోనే టీమ్ ఇండియా.. 2007లో టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అలాగే 2011లో వన్డే వరల్డ్ కప్ చేజిక్కించుకుంది.  ఇటు ఏపీలోనూ ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అన్నిటికీ మించి దేశంలో ఒక మతంగా మారిన క్రికెట్ పట్ల ధోనీకి ఉన్న ప్రేమ  ఆయన అంతర్జాతీయ క్రికట్ కు గుడ్ బై చెప్పి ఏళ్లు గడుస్తున్న ఆయన పట్ల అభిమానుల్లో క్రేజ్ ఇసుమంతైనా తగ్గకుండా సజీవంగా ఉంచుతోంది. ఇప్పుడు ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ, అలాగే ధోనీ పర్యవేక్షణలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణం ప్రతిపాదనల నేపథ్యంలో  చంద్రబాబుతో ధోనీ  భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

నడిరోడ్డుపై మృతదేహం… పట్టించుకోని జనం

  హైదరాబాద్ టోలిచౌకి ప్రధాన రహదారిపై నడిరోడ్డుపై ఒక యువకుడి మృతదేహం పడివున్నా, పలువురు వాహనదారులు ఏమాత్రం చలించకపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ప్రైవేట్ బస్సు ఢీకొని మృతి చెందిన జెప్టో డెలివరీ బాయ్ అభిషేక్ మృతదేహం రోడ్డుపై పడి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా మార్చాయి. టోలి చౌక్ వద్ద జిప్టో డెలివరీ బాయ్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. అయితే అదే సమయానికి వెనక నుండి వస్తున్న ప్రవేట్ బస్సు అది గమనించకుండా అభిషేక్ తలపై నుండి బస్సు వెళ్ళింది.  దీంతో అభిషేక్ అక్కడికక్కడే మరణించాడు. బస్సు ఆపకుండా అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా కొంతమంది స్థానికులు అడ్డగించి బస్సు డ్రైవర్లు పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అభిషేక్ రోడ్డు మీద పడిపోవడంతో కొందరు వాహనదారులు మృతదేహం పక్కనుంచే నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుకుంటూ వెళ్లిపో యారు. బతికున్నాడా? గాయపడ్డాడా? అన్న కనీస మానవీయ విచారణ కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే  ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారిలో కొందరు కూడా పోలీసులకు లేదా అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలన్న కనీస బాధ్యతను నిర్వర్తించలేదు.  నడిరోడ్డుపై మృతదేహం చూస్తే అక్కడినుండి వెళ్ళిపోయిన ఘటన సమాజంలో మానవత్వం ఎంతగా క్షీణించిందో చాటిచెప్పింది. రోడ్డుపై పడివున్న వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడా లేదా అన్న విషయం తెలుసుకునే నైతిక జ్ఞానం కూడా కొందరు వాహనదారుల్లో కనపడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో నిమగ్నమై, బాధ్యతలేమితో అక్కడి నుంచి వెళ్లిపోవడం చూసి పలువురు స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ఘటనపై సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ జరుగు తోంది. ప్రమాదాల సమయంలో బాధితులకు సాయం చేయడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని, కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని పలువురు గుర్తుచేస్తున్నారు. నడిరోడ్డుపై మృతదేహం ఉన్నా స్పందించని ఈ నిర్లక్ష్యం మరోసారి సమాజానికి అద్దం పట్టినట్టయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

పుస్తక ప్రదర్శనలో ఎన్టీఆర్ అరుదైన లేఖలు

  అన్న నందమూరి తారక రామారావు ఎప్పుడో 1950 దశకంలో రాసిన లేఖలను ప్రస్తుతం బెజవాడ పుస్తక ప్రదర్శనలో చిన్నా, పెద్దలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అప్పట్లో చెన్నైలో ఉన్న తారకరాముడు తెలుగు భాషను ప్రాణంగా భావించేవారు. తెలుగాభాషను ఎన్టీఆర్ ఎంత గౌరవీంచేవారనడానికి ప్రత్యక్ష నిదర్శంగా నిలుస్తున్నాయి 1950ల్లో ఆయన రాసిన లేఖలు. కృష్ణ జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలోని ఆంధ్ర గ్రంధాలయం ప్రచారం కోసం పనిచేస్తున్న కొందరు 1955లో ఎన్టీఆర్‌ను  కలిశారు.  వారి సేవల గురించి తెలుసుకుని, వారిని అభినందిస్తూ ఎన్టీఆర్ స్వదస్తూరితో లేఖ రాశారు. తర్వాత 1957 సెప్టెంబర 16న గ్రంథాల సేవలను మెచ్చుకుంటూ రూ.100 చెక్కు ఇస్తున్నానని మద్రాసు నుంచి మరో లేఖ పంపించారు. ఎన్టీఆర్ సంతకంతో ఉన్న ఆ లేఖలను ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయం ఏర్పాటు చేసిన స్టాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ యుగపురుషుడి లేఖలను అందరూ ఆసక్తిగా తిలకిస్తూ.. చిత్ర పరిశ్రమను, తెలుగు భాషను  గుర్తుచేసుకుంటున్నారు.  

హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు

  తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల  12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే  ఈ నెల 12న ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆధ్వర్యంలో వేలుసామిపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది.  ఈ సందర్భంగా ఆయను చూసేందుకు ఫ్యాన్స్, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో సుమారు 41 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును విచారించినప్పటికీ, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్లు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అలాగే, విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి  నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.

పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి...రోజా సంచలన వ్యాఖ్యలు

    వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలోనే అట్టడుగు స్ధానంలో ఏపీ పోలీస్ శాఖ ఉందని రోజా విమర్శించారు.  కేంద్ర నివేదికను చూసి సీఎం చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత సిగ్గుపడాలని విమర్శించారు.  మన పోలీస్ వ్యవస్ధను చూసి అందరు నవ్వుతున్నారని తెలిపారు. నెల్లూరు జైలులో పిన్నెల్లి సోదురులతో ములాఖత్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులతో వేధిస్తోందని ఆమె మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వైసీపీ హయంలో రూ. 960 కోట్లతో పనులు చేపట్టితే.. ఆ పనులను కూటమి ప్రభుత్వం ఆపాలని చూస్తోందని రోజా ఆరోపించారు. ఇంత జరగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు  

ఫాల్కన్ స్కామ్ కేసులో ఆ సంస్థ ఎండీ అమర్ దీప్ అరెస్టు

వందల కోట్ల రూపాయల ఫాల్కన్ స్కామ్ కేసులో  ప్రధాన నిందితుడు,  ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్లు, మల్టీ నేషనల్ కంపెనీలు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో అమర్ దీప్ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి ప్రజలను మోసగించిన అమర్ దీప్ దాదాపు 850 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ బయటపడగానే అమర్ దీప్ తన ఛార్టర్డ్ ఫ్లైట్ లో దుబాయ్ పారిపోయాడు. దీంతో తెలంగాణ పోలీసులు అమర్ దీప్ పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ముంబై వెళ్లి అమర్ దీప్ ను అరెస్టు చేశారు.    ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ సంస్థ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్ దీప్ అరెస్టుతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్  పేరుతో దేశవ్యాప్తంగా వేలాది మందిని దారుణంగా మోసం చేసిన ఈ కేసులో అమర్ దీప్ అరెస్టు కీలక పరిణామంగా చెప్పవచ్చు.  మెస్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా అక్రమ డిపాజిట్లు సేకరించి వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్‌పై   తెలంగాణ పోలీసులు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల ఆధారంగా   అమర్‌దీప్ భారత్ కు వచ్చినట్లు తెలుసుకున్న  తెలంగాణ పోలీసులు సోమవారం (జనవరి 5)  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో   కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అమర్‌దీప్ కుమార్  ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్  బ్రాండ్ పేరుతో పనిచేస్తున్న మెస్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మోసం, క్రిమినల్ కాన్సిపరసీ కింద కేసులు నమోదు చేశారు. ప్రసిద్ధ బహుళజాతి సంస్థల పేర్లను ఉప యోగిస్తూ నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ డీల్స్‌ను రూపొందించాడు. ఇందుకోసం మోసపూరిత వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి, అధిక స్వల్పకాలిక లాభాలు వస్తాయని హామీలు ఇస్తూ సామాన్య ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టాడు. ఈ స్కామ్‌లో మొత్తం 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్ల అక్రమ డిపాజిట్లను అమర్ దీప్ సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో 4,065 మంది బాధితులు దాదాపు రూ.792 కోట్ల మేర నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా.పెట్టుబడిదారుల ఫిర్యాదుల ఆధారంగా సైబరాబాద్  కేసులు నమోదు చేసి, అనంతరం దర్యాప్తును సీఐడీకి  బదిలీ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్‌తో సహా మొత్తం 11 మంది నిందితు లను అరెస్టు చేసి న్యాయ స్థానం ముందు హాజరు పరచగా, వారంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.  దర్యాప్తులో భాగంగా 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు, రూ.8 లక్షల నగదు, 21 తులాల బంగారం, రూ.20 కోట్ల విలువైన ఆర్‌డిపి షేర్లు, రూ.8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌లు సహా మొత్తం సుమారు రూ.43 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వాటి అటాచ్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది.  

పరకామణి కేసులో ప్రమేయమున్న పోలీసులకు షాక్

ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల దేవస్థానం పరకామణి కేసులో ఏపీ హైకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు మంగళవారం (జనవరి 6) హైకోర్టులో విచారణకు రాగా.. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలివ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చోరీ కేసు మినహా సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి (జనవరి 8)వాయిదా వేసింది. కాగా.. ఈ కేసులో అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌తో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించిన ఎస్‌ఐ లక్ష్మీ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ముగ్గురు పోలీసు అధికారులను పోలీస్ శాఖ వీఆర్‌కు పంపించింది. అయితే ఈ కేసుతో ప్రమేయం ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి కొన్ని పత్రాలను తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కుంటున్న వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.