వీడిని పట్టిస్తే 10 లక్షలు.. పోలీసుల రివార్డ్...
posted on Sep 14, 2021 @ 8:09PM
ఈ ఫోటోలో ఉన్నది రాజు. వీడో నరరూప రాక్షసుడు. సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై హత్యా-చారం, హత్య చేసి పారిపోయిన ఉన్మాది. ఘటన జరినప్పటి నుంచీ గాయబ్ అయ్యాడు. పోలీసులు ఎంత గాలిస్తున్నా దొరకడం లేదు. అదే రోజు సాయంత్రం ఎల్బీనగర్‌లోని ఓ వైన్స్‌లో మందుకొట్టి.. స్నేహితుడితో కలిసి వెళుతున్న సీసీకెమెరా ఫూటేజ్ మాత్రం లభించింది. అయినా, ప్రయోజనం లేకుండా పోయింది. నిందితుడు రాజు ఎక్కడికి వెళ్లాడో తనకు తెలీదన్నాడు వాడి ఫ్రెండ్.
ఆ రోజు నుంచీ హైదరాబాద్ పోలీసులు పగలు-రాత్రి లేకుండా గాలిస్తున్నారు. 10 బృందాలుగా విడిపోయిన 100మంది పోలీసులు వాడి కోసం సెర్చ్ చేస్తున్నారు. అయినా చిల్లర దొంగ రాజు ఆచూకీ మాత్రం చిక్కడం లేదు. పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ.. ఖాకీలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు.
మరోవైపు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క లాంటి వాళ్లు బాధితురాలి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితుడిని పట్టుకోలేకపోతున్న పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. పాలకులనూ నిలదీస్తున్నారు. దీంతో.. ఖాకీలపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. మరోవైపు, చిన్నారిని నలిపేసిన దుర్మార్గుడు మాత్రం 4 రోజులు గడుస్తున్నా పత్తా లేకుండా పోవడంతో ఖాకీల పరువంతా పోతోంది. దీంతో, పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సైదాబాద్ బాలికను కాలరాసిన నిందితుడు రాజును పట్టించిన వారికి 10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్రకటించడం అనూహ్య విషయం.
నిందితుడు రాజుకి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చూపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మద్యం తాగి ఉంటాడని, ఫుట్‌పాత్, బస్టాండుల్లో పడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.