పోలీసు పహారాలో అర్ధరాత్రి ఇండ్ల కూల్చివేత.. సీఎం జగన్ ఇంటి సమీపంలో అరాచకం
posted on Jul 22, 2021 9:25AM
తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోని అమరారెడ్డి కాలనీలో పోలీసుల పహారాలో ఇళ్లు తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 200 ఇళ్లు వరకూ కూల్చేసిన అధికారులు. మిగిలిన వాటిని కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఒకరోజు ముందు తేదీతో సాయంత్రం ఆరు గంటలకు నోటీసు ఇచ్చి వెంటనే కూల్చివేతలకు దిగారు. ఇంట్లో ఉన్నవారు గడువు కావాలని వేడుకున్నా కనికరించలేదు. వినకపోవడంతో బాధితులు ప్రొక్లెయినర్‌కు అడ్డుగా పడుకున్నాడు. పోలీసులు వచ్చి లాగేయడంతో ఓ యువకుడు ఇంట్లోకి వెళ్లి ఉరేసుకునే ప్రయత్నం చేశాడు. అతని సోదరి గుర్తించి కేకలు వేయడంతో పోలీసులు వెళ్లి తలుపులు తీసి అతన్ని బయటకు తీసుకొచ్చారు.అంతకుముందు అతని తల్లి రాజ్యలక్ష్మి స్పృహ తప్పి పడిపోవడంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
కూల్చివేతలకు నిరసనగా బాధితుల అరుపులు కేకలతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది.కూల్చివేతలు సమయంలో ఇళ్లలో ఉంటున్న వారిని ఎవరినీ పోలీసులు బయటకు రానీయడం లేదు. వస్తే కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. రాత్రికి రాత్రి ఖాళీ చేయకపోతే ఉదయానే స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎదురు మాట్లాడితే ఏ కేసులో ఇరికిస్తారో అనే భయం గృహ యజమానులను వెంటాడుతోంది.బాధితులు జిల్లా కలెక్టర్‌ను కాలనీ వాసులు కలిసి ఇళ్లు ఖాళీ చేసేందుకు నాలుగు నెలల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. కొంత సమయం ఇస్తే తామే స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేసి వెళతామని చెప్పినట్లు కాలనీ వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయినా పట్టించుకోని పోలీసులు.. రాత్రికల్లా బలవంతంగా జెసిబిలు తీసుకొచ్చి కూల్చివేతలకు దిగారు. దీంతో ఇదెక్కడి న్యాయమని గృహ యజమానులు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నివాసం వెనక పేదల ఇళ్ల కూల్చివేతలపై పోరాడుతున్న శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇంటిని కూల్చివేస్తున్నామని, గురువారం లోగా ఖాళీ చేసి వెళ్లాలని మంగళవారం నోటీసులు అంటించిన అధికారులు గతరాత్రి కూల్చివేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవడం వల్లే తన ఇంటిని కూల్చివేశారని, అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని శివశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ శివశ్రీ వీడియో విడుదల చేశారు.
నోటీసు ఇవ్వడానికి ముందు ఇంట్లో ఉంటున్న శివశ్రీ అనే యువతిని పోలీసులు పట్టుకెళ్లారు.స్థానికులు అఖిలపక్ష నాయకులు వెళ్లి గొడవచేయడంతో మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వదిలేశారు.
కక్షసాధింపుగా సాయంత్రం ఆరుగంటలకు వెళ్లి ఆమె ఇంటిని కూల్చివేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. కూల్చివేతల కోసం వందలాది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరుగ వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు జంగాల సాంబశివరావు తదితరులు అక్కడకు చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈలోపు ఇన్‌ఛార్జి కమిషనర్ హేమమాలిని సంఘటనాస్థలానికి రావటంతో సమయం ఇవ్వాలని కోరినా వినకుండా అర్థరాత్రి 11 గంటల సమయంలో శివశ్రీ ఇంటిని కూల్చివేశారు.