లోక్‌సభను కుదిపేసిన 'భగవద్గీత’నిషేధం
posted on Dec 19, 2011 @ 3:54PM
న్యూఢిల్లీ: హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై రష్యాలో నిషేధం విధంచాలంటూ ఒకరు అక్కడ కోర్టుకెక్కిన విషయంపై సోమవారం భారత పార్లమెంటు అట్టుడికింది. దీంతో సభ కార్యకలాపాలు సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడ్డాయి. అంతకుముందు ఇదే అంశంపై సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అతివాదాన్ని ప్రేరేపించేలా ఉన్న భవద్గీతను నిషేధించాలని రష్యాలోని సెబీరియన్ కోర్టులో గత జూన్‌లో పిటిషన్ దాఖలయింది. దీనిపై కోర్టు తీర్పు నేడు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు సోమవారం ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. భగవద్గీతను, కృష్ణభవానుడిని అవమానిస్తే సహించబోమని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. ఆయనకు పలువురు ఎంపీలు మద్దతు తెలిపారు. జీరో అవర్‌లో తొలుత ఈ అంశాన్ని బీజేడీ ఎంపీ బతృహరి మహతాబ్ లేవనెత్తారు. రష్యాలో భారత రాయబారి ఈ అంశాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. భగవద్గీత ద్వేషాన్ని ప్రబోధించదని అన్నారు. రష్యాలో ఉన్న హిందువుల మత స్వేచ్ఛను కాపాడే విషయంలో రాజీ పడొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రష్యాలోని ఇస్కాన్ ఇప్పటికే భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని శివసేన, బీజేపీ, ఆర్జేడీ, బీఎస్పీ, సమాజ్‌వాది పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. నోటీసిస్తే ఈ అంశంపై సభలో చర్చించవచ్చని స్పీకర్ మీరాకుమార్ సభ్యులను సముదాయించారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో సభను వాయిదా వేశారు. కాగా లోక్‌పాల్ బిల్లు కోసం పార్లమెంటు సమావేశాలు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.