కిరణ్ కుమార్ రెడ్డిపై వేటు వేస్తే

 

కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిన్న డిల్లీలో దీక్ష చేయడంతో ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం రేపు రాజ్యసభ ఎన్నికలు పూర్తవగానే, ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుండి తప్పించబోతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజన ప్రకటన చేసినప్పటి నుండి ఆయన ఏదో ఒక రూపంగా తన నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడని కాంగ్రెస్ పెద్దలే స్వయంగా కితాబులు ఇస్తూ వచ్చారు తప్ప ఏనాడు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత కేంద్రప్రభుత్వం పంపిన టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఆయన శాసనసభలో తీర్మానం చేయించినప్పుడు కూడా ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు డిల్లీలో దీక్ష చేసినందుకు ఆయనను పదవిలో నుండి తొలగించాలనుకొంటే, అసలు ఆయన దీక్ష చేయకుండా ముందే ఎందుకు అడ్డుకోలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.

 

కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో కలిసి డిల్లీలో నిరసన దీక్ష చెప్పట్టబోతున్నారనే సంగతి ఆయన అనుచరుల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన దీక్ష చేసినట్లయితే అది తనకు తీరని అప్రదిష్ట కలిగిస్తుందని తెలిసి ఉన్నపటికీ, కాంగ్రెస్ ఆయనను అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. కనీసం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ వంటి తన విధేయులను కూడా వారించలేదు. వారించి ఉంటే దీక్షలో ముఖ్యమంత్రి ఒంటరివారయ్యే వారు. ఆయనే అవమానం పాలయ్యేవారు. కానీ కాంగ్రెస్ వారించలేదు. అందుకే అధిష్టానానికి విదేయులయిన కేంద్రమంత్రులు, యంపీలు, శాసన సభ్యులు, చివరికి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా అందరూ దీక్షలో కూర్చొన్నారు.

 

రాష్ట్ర విభజనపై మాట్లాడేందుకు కాంగ్రెస్ అధిష్టానమే వారికి స్వేచ్చ ప్రసాదించిందని ఇంతకాలం గొప్పగా చెప్పుకొన్నప్పుడు, ఇప్పుడు వారు దీక్ష చేసి నిరసన తెలియజేస్తే మాత్రం ఎందుకు ఆగ్రహించాలి? ముఖ్యమంత్రి నిరసన దీక్ష చేసి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, పార్టీకి అప్రదిష్ట కలిగించారని కాంగ్రెస్ అధిష్టానం భావించి ఆయనపై వేటు వేయదలచుకొంటే మరి పార్టీ పరువు కాపాడవలసిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా దీక్షలో పాల్గొన్న సీమాంధ్ర నేతలందరిపై కూడా వేటు వేయవలసి ఉంటుంది. కానీ, వారందరినీ అడగకుండానే క్షమించేసి, కేవలం ముఖ్యమంత్రిపైనే వేటు వేస్తే, ఆయనని, కాంగ్రెస్ అధిష్టానాన్ని అనుమానించక తప్పదు.

 

పార్టీ తరపున నిలబడిన రాజ్యసభ సభ్యుల గెలుపుకోసం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కృషి అధిష్టానం పట్ల ఆయన విధేయతకు అద్దం పడుతోంది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఈ సాకుతో పదవిలో నుండి తప్పిస్తే, అది ఆయనకు శిక్షగా కాక సమైక్య చాంపియన్ గా ఎదిగేందుకు బహుమానం ఇస్తున్నట్లుంది. రాష్ట్ర సమైక్యత కొరకు తన అధిష్టానాన్నే ధిక్కరిస్తున్న కారణంగా ప్రజలలో జేజేలు అందుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందక మునుపే పదవిలో నుండి తప్పించినట్లయితే, ఆయన బిల్లు ఆమోదం పొందేవరకు కూడా కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రజలలో మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి వీలవుతుంది. అప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టుకొని ప్రజలలోకి వెళితే దాని ఫలితం ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోనే జమా అవ్వాలంటే, అందుకు ఇదే మంచి పద్ధతి.

Teluguone gnews banner