పని మొదలెట్టేసిన దిగ్విజయ్ సింగ్
posted on Dec 20, 2022 @ 3:34PM
తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభ నివారణ బాధ్యతలను హైకమాండ్ దిగ్గీ రాజాకు అప్పగించీ అప్పగించగానే ఆయన రంగంలోకి దిగిపోయారు. కట్టు రాష్ట్ర పార్టీ నేతలను దారిలో పెట్టేందుకు నడుం బిగించేశారు. పార్టీలో తొలి నుంచీ ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్ లతో పాటు దిగ్విజయ్ సింగ్ కు కూడా ట్రబుల్ షూటర్ గా పేరున్న సంగతి తెలిసిందే.
ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తరువాత కాంగ్రెస్ లో గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ లు మాత్రమే ట్రబుల్ షూటర్లుగా మిగిలారు. గులాం నబీ ఆజాద్ పార్టీ వీడి వేరు కుంపటి పెట్టుకున్నాకా.. కాంగ్రెస్ లో సంక్షోభ వివారణకు దిగ్విజయ్ మాత్రమే దిక్కైన పరిస్థితి.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని నివారించే బాధ్యతలను పార్టీ హైకమాండ్ దిగ్విజయ్ కు అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన ఆయన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లతో ఫోన్ లో మాట్లాడారు. అంతే సీనియర్లు వెనక్కు తగ్గారు. మంగళవారం (డిసెంబర్ 20) సాయంత్రం జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేశారు. ఒకటి రెండు రోజుల్లో తాను హైదరాబాద్ వచ్చి నేతలతో మాట్లాడతానని దిగ్విజయ్ సింగ్ సీనియర్లకు చెప్పారు. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డితో మాట్లాడగా, పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో మాట్లాడినట్లు సమాచారం.
తెలంగాణ పీసీసీ కమిటీల నియామకంతో రాష్ట్ర కాంగ్రెస్ లో మొదలైన చిచ్చు అంతకంతకూ పెరుగుతూ రాజీనామాల వరకూ వెళ్లింది. రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గంగా చీలిపోయి పరస్పర విమర్శల పర్వం కొనసాగుతూ వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ పదవుల్లో తన వర్గం వారికే రేవంత్ రెడ్డి పట్టం కట్టాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. దీంతో సీనియర్ నేతల ఆరోపణలను తిప్పి కొడుతూ రేవంత్ వర్గీయులు 12 మంది తమ పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దింపింది.