మరో నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు...
posted on Oct 30, 2019 @ 5:59PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురిసింది, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, మరో నలభై ఎనిమిది గంటల్లో ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణాలో ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఒక మోస్తరులో వర్షాలు పడుతున్నాయి.
వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు, మూడు రోజులకు తెరిపిచ్చిన తర్వాత మళ్లీ కురవటం మొదలు పెట్టాయి. కాకపోతే ఈ కరీఫ్ లో పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి, భారీ వరదలతో ఒంగోలు తడిసి ముద్దయ్యింది. చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.