దేశంలో ఇప్పటివరకు ఎంతమందిని ఉరితీశారు? నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేదా?
posted on Jan 10, 2020 @ 2:29PM
నిర్భయ దోషులను ఉరి తీయనున్న నేపధ్యంలో మరణశిక్షల అమలు మరోసారి తెరపైకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఒక వెయ్యి పద్నాలుగు మందిని ఉరి తీశారు. అయితే, నేషనల్ క్రైం రికార్డులను పరిశీలిస్తే గత 15ఏళ్లలో నాలుగు ఉరి శిక్షలు మాత్రమే అమలు అయ్యాయి. 2003-18 డిసెంబర్ మధ్య కాలంలో కోర్టులు ఏకంగా 400 మందికి ఉరి శిక్షలు విధించాయి. వీరిలో నలుగురు మాత్రమే ఉరికంభం ఎక్కారు. గత 15ఏళ్లలో మరణ దండన విధించిన కేసుల్లో కేవలం ఒక్క శాతం మందినే ఉరితీసినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది
ఒక టీనేజ్ అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన 44ఏళ్ల వాచ్‌మెన్ ధనుంజయ్ ఛటర్జీని 2004 ఆగస్టు 14న బెంగాల్‌లోని ఆలీపూర్ జైల్లో ఉరి తీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుపడ్డ కసబ్‌ను 2012 నవంబర్‌లో పూణె ఎర్రవాడ జైల్లో ఉరి తీశారు. పార్లమెంట్‌పై దాడి కేసులో 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురును తీహార్ జైల్లో ఉరి తీశారు. గత 15 ఏళ్లలో ఉరి కంభం ఎక్కిన నాలుగో వ్యక్తి యాకూబ్ మెమెన్. అయితే, కోర్టులు విధించిన 1200 మరణ శిక్షలను ఉన్నత న్యాయస్థానాలు యావజ్జీవ ఖారాగార శిక్షలుగా మార్చాయి. ఘోరమైన నేరాలకు పాల్పడిన ఈ దోషులకు శిక్ష తగ్గిస్తే ప్రజలు క్షమించరనే భయంతో నలుగురిని మాత్రమే ఉరితీశారు.
చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు నిర్భయ దోషులందర్నీ ఒకేసారి ఉరి తీయనున్నారు. ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన ఘటనలో వారిని ఉరికంభం ఎక్కించనున్నారు. ఈ మేరకు తీహార్ జైల్లో నాలుగు ఉరికంభాలను అధికారులు సిద్ధం చేశారు. ఆ ఉరికంభాలతో పాటు నాలుగు సొరంగాలను కూడా నిర్మించారు. నిర్భయ దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌కి ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మరోవైపు చాలా మంది రాష్ట్రపతి క్షమాభిక్షను అభ్యర్థిస్తుండటం వల్ల మరణదండన అమలులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో మరణశిక్ష ఖరారైన దోషులు రాష్టప్రతి క్షమాభిక్ష పెడితే జీవితాంతం జైలులో గడిపేయవచ్చునని ఎదురు చూస్తున్నారు.
కొన్ని దేశాల్లో అమలవుతున్న మరణశిక్షలను పరిశీలిస్తే విస్మయాన్ని కలిగిస్తాయి. చైనాలో వెయ్యిమందికి మరణశిక్షను విధిస్తే అంతమందినీ ఉరితీశారు. ఇరాన్‌లో 507 మందిని, సౌదీ అరేబియాలో 146 మందిని, ఇరాక్‌లో 125 మందిని, పాకిస్తాన్‌లో 60 మందిని, ఈజిప్టులో 35 మందిని, అమెరికాలో 23 మందిని, అఫ్ఘానిస్తాన్‌లో ఐదుగురిని, మలేషియాలో నలుగురిని, జపాన్‌లో నలుగురిని ఉరితీశారు. భారత్‌లో 2017లో ఒక్కరికి కూడా ఉరిశిక్షను విధించలేదు. ఇదిలా ఉంటే, ప్రపంచంలో 142 దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయి. 56 దేశాలు మాత్రమే ఉరిశిక్షను అమలు చేస్తున్నాయి. మన దేశంలో మరణశిక్ష విధించే చట్టాలు ఉన్నా, ఆ శిక్షలు అంతగా అమలు కావడం లేదు. గతంలో ప్రతిఏటా పదుల సంఖ్యలో ఉరి అమలు కాగా, ఇప్పుడు మాత్రం జాప్యం జరుగుతోంది.