Read more!

భార్యాభర్తలలో ఉండే ఈ అలవాట్లు ఏకంగా విడిపోవడానికి దారితీస్తాయ్!

 

ఈ ప్రపంచంలో భార్యభర్తల బంధం చాలా గొప్పది. ఈ బంధాన్ని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీదనే  ఆధారపడి ఉంటుంది.  సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి, పరస్పర అవగాహన, ప్రేమ,  నమ్మకం వంటివి అవసరం. సహజంగానే విభిన్న స్వభావం గల ఇద్దరు వ్యక్తులు ఒకచోట ఉన్నప్పుడు  అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కానీ వాటిని పరిష్కరించడానికి భార్యాభర్తలిద్దరూ కూర్చుని అవగాహనతో నెమ్మదిగా మాట్లాడుకోవడం ముఖ్యం.  సంబంధాలలో చిన్న చిన్న తగాదాలు సాధారణం. కానీ ఇవి  ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు. కానీ ఎప్పుడూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటే మాత్రం దీని గురించి ఆలోచించాల్సిందే.. ముఖ్యంగా భార్యాభర్తలలో ఉండే కొన్ని అలవాట్ల కారణంగా గొడవలు ఎక్కువగా అవుతుంటాయి. వీటి గురించి భార్యాభర్తలు జాగ్రత్త తీసుకుంటే వారి బంధం పదిలంగా ఉంటుంది.

కమ్యూనికేషన్ లేకపోవడం..

ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అవసరం. ఇద్దరి మధ్య  తగాదాలు ఉన్నా  దాన్ని ఆపకుండా   ఉంటే లేదా  సమస్యను వదిలి అప్పటికే ముందుగా ఉన్న తగాదా గురించే మాటిమాటికి మాట్లాడుతూ ఉంటే అది బంధం విచ్చిన్నం కావడానికి దారితీస్తుంది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటేనే సమస్యలు ఏవైనా పరిష్కారం అవుతాయి.

బాధ్యతల నుండి తప్పించుకోవడం..

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసినా లేదా ఒకరే ఉద్యోగం చేసినా ఇంటిపని, బయటి పని అనే బాధ్యతలను విభజించుకోవాలి. పనిని ఎగ్గొట్టడం, తప్పించుకోవడం, పని లేకుండా ప్లాన్ చేయడం వంటివి   ఇద్దరి మధ్య గొడవకు దారితీస్తుంది. దీని కారణంగా  చాలా గొడవలు జరుగుతాయి.

గౌరవించకపోవడం..

 వైవాహిక జీవితం అనే బండి  సజావుగా నడవడానికి అవసరమైన మరొక విషయం ఒకరినొకరు గౌరవించడం. ఒకరి పనిని మెచ్చుకోండి,  ఇద్దరి బంధంలో ఒకరి ప్రాధాన్యతను మరొకరు గుర్తించాలి.  భాగస్వామిలో లోపాలను వెతుకుతూ, వారిలో మంచి విషయాన్ని గ్రహించకుండా ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటే వైవాహిక బంధం నాశనం అవుతుంది.

అనవసర కోపాలు..

కొందరికి చిన్న విషయాలకు చటుక్కున కోపం వస్తుంది. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం, అనవసరంగా కోపం తెచ్చుకోవడం... ఇవి  భార్యాభర్తల బంధంలో   గొడవలకు కారణం కావచ్చు. ఎప్పుడూ  కోపంగా ఉండే భాగస్వామితో మాట్లాడటం  కష్టం.  కోపం ఎెందుకు వస్తుందనే విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాలి తప్పితే భాగస్వామి ముందు అనవసరంగా కోపం తెచ్చుకుంటే బంధం నిలవదు.


                                          *రూపశ్రీ.