నందిగామ పర్యటనలో బాబు లక్ష్యంగా రాళ్ల దాడి
posted on Nov 4, 2022 @ 10:45PM
రెండు రెళ్ళు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ప్రభుత్వ ప్రజా వ్యతరేక చర్యలను ప్రశ్నించే నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడటమే ఏపీలో పాలన అయిపోయింది. అరాచక పాలనకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్రంలో గూండాయిజం రాజ్యమేలుతోంది.
అధికార పార్టీని విమర్శించే వారెవరూ రోడ్ల మీద తిరగడానికి వీల్లేదన్నట్లుగా పాలన సాగుతోంది. పోలీసుల డ్యూటీ విపక్ష నాయకులు, కార్యకర్తల ఇళ్ల పై దాడులు చేసి అరెస్టు చేయడానికే పరిమితమైంది. ప్రభుత్వాన్ని వ్యతరేకించేవారెవరూ రాష్ట్రంలో బతకడానికి వీల్లేదన్నంతగా రాజ్య హింస ప్రబలిపోయింది. విపక్ష నేతకూ భద్రత లేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. తెలుగుదేశం అదినేత నారా చంద్రబాబునాయుడు నందిగామ జిల్లాలో పర్యటిస్తూంటే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఆ సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నందిగామలో చంద్రబాబు పర్యటనకు జనం భారీగా వచ్చారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అందుకోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లుగా ఆ వెంటనే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారి గాయపడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఆ వెంటనే రాళ్ల దాడి జరగడం కాకతాళీయమని ఎవరూ భావించడం లేదు.
ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందన్న టీడీపీ నేతలవి కేవలం ఆరోపణలు కాదనే జనం అంటున్నారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మొత్తం పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ రౌడీలకు భయపడే ప్రశ్నే లేదన్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ఇదే విధంగా వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగే వారా అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల జగన్ కు ఇసుమంతైనా గౌరవం, నమ్మకం లేదని చంద్రబాబు విమర్శించారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని.. భద్రత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు.