తెలంగాణ బీజేపీలో వర్గపోరు ముదురుతోందా?
posted on Nov 7, 2020 @ 3:13PM
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోందా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాలుగా నేతలు విడిపోయారా? పార్టీ నేతల వలసల వెనక ఆయన హస్తం ఉందా?. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీ కేడర్ తో పాటు ప్రజల్లో వస్తున్న సందేహాలివి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలం పార్టీకి నాయకుల మధ్య వర్గపోరు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య వర్గ పోరు జరుగుతోందని సమాచారం. పార్టీ నేతలు కూడా ఇరు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు. నేతల మద్య వర్గపోరు ఉందనడానికి బలాన్నిచ్చేలా ఆ పార్టీలో వరుస ఘటనలు జరుగుతున్నాయి.
ఇటీవల కిషన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధిపేట ఘటనలో కేంద్రమంత్రిగా కలెక్టర్, సీపీని పిలిపించి మాట్లాడే అధికారం కిషన్ రెడ్డికి ఉన్నా ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. అయితే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా బీజేపీ నేతలెవరు స్పందించలేదు. నిజానికి కేంద్రమంత్రిని టార్గెట్ చేశారు కాబట్టి పార్టీ అధ్యక్షుడైన సంజయే ఖండించాలి. కాని బండి ఆ పని చేయలేదు. అంతేకాదు ఇతర నేతలు కూడా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వలేదు. ఈ ఘటనతో బీజేపీలో కిషన్ రెడ్డికి, సంజయ్ వర్గాల మధ్య వార్ జరుగుతుందన్నది తెలుస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సిద్దిపేట పోలీసులు తనపై దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అయినా కేంద్రమంత్రిగా ఉన్నకిషన్ రెడ్డి ఆ ఘటనపై సీరియస్ గా స్పందించలేదని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కేంద్రమంత్రి హాోదాలో ఆయన జిల్లా కలెక్టర్, సీపీని పిలుపించుకుని మాట్లాడొచ్చు. కాని కిషన్ రెడ్డి మాత్రం దుబ్బాక వెళ్లి రఘునందన్ రావుతో మాట్లాడి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వచ్చేశారు. ఇది కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే దానికి బలాన్నిస్తోంది. రఘునందన్ రావుది సంజయ్ టీమ్ వర్గంగా చెబుతారు, అందుకే దుబ్బాక ఉప ఎన్నికను కిషన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగుతున్నా కిషన్ రెడ్డి ఎక్కువగా ప్రచారం చేయకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది.
బండి సంజయ్ కమిటిలో కిషన్ రెడ్డి వర్గీయులను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్నిజిల్లాల్లోనూ కిషన్ రెడ్డికి అనుచరులుగా ఉన్నవారిని పక్కన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి .. టీవీ చర్చల్లో పార్టీ వాయిస్ ఘనంగా వినిపించే జూబ్లీహిల్స్ ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డికి సంజయ్ టీమ్ లో చోటు దక్కకపోవడం అందరిని అశ్చర్యపరిచింది. కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నందువల్లే శ్రీధర్ రెడ్డిని తీసుకోలేదని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారని తెలుస్తోంది. శ్రీధర్ రెడ్డి తరహాలోనే చాలా మంది కిషన్ రెడ్డి అనుచరులకు బండి సంజయ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని పా్టీలో చర్చ జరుగుతోంది.
పార్టీలో తన మనుషులను నిర్లక్ష్యం చేయడంపై కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ తనకు తెలియకుండానే సంజయ్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. సంజయ్ తీరుతో అసహనంగా ఉన్న కిషన్ రెడ్డి... కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదని చెబుతున్నారు.ఈ కారణంగానే బండి సంజయ్ పై సిద్దిపేట పోలీసులు దాడి చేశారని ఆరోపణలు వచ్చినా.. కిషన్ రెడ్డి అంతగా స్పందించలేదని చెబుతున్నారు. కరీంనగర్ లో సంజయ్ ధీక్ష చేస్తున్నా.. షుగర్ లెవల్స్ పడిపోయి ఆస్పత్రిలో చేరినా కేంద్రమంత్రి అక్కడి వెళ్లలేదనే చర్చ జరుగుతోంది.
కిషన్ రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్ వర్గ నేతలు. సంజయ్ కు చెక్ పెట్టేందుకు కిషన్ రెడ్డి మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర సమస్యలపై బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిన రోజే.. ఢిల్లీనుంచి వీడియో కాన్పరెన్స్ లో కిషన్ రెడ్డి అవే అంశాలపై మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల్లో సంజయ్ కు గ్రాఫ్ పెరగకుండా ఉండేందుకే కిషన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి ఎందుకు ఎక్కువగా ప్రచారం చేయలేదో చెప్పాల్సి ఉందన్నారు, రఘునందన్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన పార్టీ నేత కమలాకర్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి అనుచరుడేనని చెబుతున్నారు . కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీకి సవాల్ గా మారిన ఉప ఎన్నిక సమయంలో తమ అనుచరుడిని కంట్రోల్ చేయలేకపోయారా అని సంజయ్ వర్గ నేతలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జూబ్లీహిల్స్ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న శ్రీధర్ రెడ్డి కిషన్ రెడ్డి డైరెక్షన్ లోనే గులాబీ గూటికి చేరారని చెబుతున్నారు బండి సంజయ్ వర్గీయులు.
బీజేపీలో మరో వివాదం కూడా ముదురుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే బండి సంజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి గత ఏడాది కాలంలో చాలా మంది నేతలు బీజేపీలో చేరారు. ఇప్పుడు పార్టీలో వారి హవానే నడుస్తుందన్నది పాత నేతల ఆరోపణ. వరంగల్ జిల్లాలో ఎంపీ గరికపాటి మోహన్ రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిని బండి ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోత్కుపల్లి హవా సాగుతుందంటున్నారు. కరీంనగర్ జిల్లాలో మాజీ ఎంపీ వివేక్, సోమారపు సత్యనారాయణ పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అంతా ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పినట్లు నడుస్తుండగా.. పాలమూరు జిల్లాలో జితేందర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ లోనూ మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ఇంపార్టెన్స్ తగ్గిదంటున్నారు బీజేపీ లీడర్లు. తమను పట్టించుకోవడం లేదనుకుంటున్న నేతలంతా కిషన్ రెడ్డిని ఆశ్రయిస్తూ బండి సంజయ్ పై ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతున్నారు.
బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీలో వర్గ పోరు ముదురుతుందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్నపార్టీకి ఇలాంటివి ఇబ్బందులు తెస్తాయని చెబుతున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం కలుగుతుందని కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరీ బీజేపీ నేతలు ఎలా ముందుకు వెళ్తారో..