గ్రీన్ దీపావళికి సై అంటున్న వరంగల్ వాసులు...
posted on Oct 21, 2019 @ 6:08PM
దీపావళి అనగానే మనకు ముందుగా గుర్తోచ్చేది రంగురంగుల టపాసులు, మిరుమిట్లు గొలిపే వెలుగులు, నిప్పులు కక్కుతూ దూసుకుపోయే దీపావళి రాకెట్లు. ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, ఇలా చైనా టపాసులు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చైనా టపాసుల విక్రయం తగ్గించే క్రమంలో గ్రీన్ దీపావళి అనే అంశం ప్రజల ముందుకు వచ్చింది .గ్రీన్ దీపావళికి భారీ స్పందన వస్తోంది. ప్రజల నుంచే కాకుండా వ్యాపారస్తులు సైతం గ్రీన్ దివాలీ వైపు కదులుతున్నారు. ఈ సారి చైనా టపాసుల్ని నిషేధించారు. తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని విక్రయిస్తున్నారు. చైనా టపాసుల్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్రం పంతొమ్మిది వందల తొంభై రెండులో చైనా బాణాసంచా ఉత్పత్తులపై పరోక్షంగా నిషేధాన్ని విధించింది. కానీ ఆ దేశ ఫైర్ వర్క్స్ దిగుమతులను మాత్రం అడ్డుకోలేకపోతోంది.
చైనా టపాసుల్లో పొటాషియం క్లోరైడ్ వాడతారు. వీటి వాడకం పై భారత్ లో ఆంక్షలున్నాయి. తక్కువ ధరకు బాణాసంచ ఉత్పత్తి చేయాలంటే అతి తక్కువ రేటు ఉన్న ముడి సరుకును ఉపయోగించాలి. మిగతా వాటితో పోలిస్తే పొటాషియం క్లోరైట్, సల్ఫరైట్, నైట్రేట్ రసాయనాలు చైనాలో అత్యంత చౌక. ఈ హానికారక రసాయనాలతో చేసిన బాణా సంచా ఎక్కువగా వెలుగులు విరజిమ్ముతాయి. పెద్ద శబ్దం వస్తుంది. సాధారణంగా భారత్ లో నూట నలభై ఐదు డెసిబుల్స్ కన్నా ఎక్కువగా శబ్దం వచ్చే బాణాసంచా తయారీ నిషేధం. చైనా టపాసులు నూట నలభై ఐదు డెసిబుల్స్ దాటి ధ్వని కాలుష్యం చేస్తాయి. ప్రతి ఏడాది వేల కోట్ల టపాసులు చైనా నుండి దొంగచాటుగా దిగుమతి అవుతున్నాయి. అయితే వీటివల్ల జరుగుతున్న నష్టాన్ని ఇపుడిపుడే గుర్తిస్తున్నారు ప్రజలు. అందుకే చైనా టపాసుల జోలికి వెళ్లటం లేదు. చివరకు వ్యాపారస్తులు సైతం స్వచ్ఛందంగా చైనా బాణా సంచాపై నిషేధాన్ని విధిస్తున్నారు.
గ్రీన్ దివాళి నినాదంతో వరంగల్ కు చెందిన వ్యాపారస్తులు చైనా టపాసుల్ని విక్రయించడం లేదు. ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు ఎనభై శాతం శబ్దం రాని వాటినే అమ్ముతున్నారు. ఈ సారి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చైనా టపాసుల్ని బహిష్కరించారు. మన దేశంలో తయారైన టపాసుల్నే విక్రయిస్తున్నారు. అది కూడా భారీ శబ్దం,కాలుష్యాం లేనివే అమ్ముతున్నారు. గ్రీన్ దీపావళి తమలో ఎంతో స్ఫూర్తి నింపిందని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. విపరీతమైన కాలుష్యానికి కారణమవుతున్న టపాసులను తగ్గించి గ్రీన్ దివాలీ వైపు అడుగులు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. వరంగల్ వాసులు ఈ సారి గ్రీన్ దివాలీ వైపు అడుగులు వేశారు. భారీగా కాలుష్యం వచ్చే టపాసుల జోలికి వెళ్లటం లేదు. భవిష్యత్ లో ఇది మరింత తగ్గి అసలైన దీపావళి జరుపుకోవాలని ఆశిద్దాం.