గ్రీకువీరుడి కొడుకు హంగామా
posted on Apr 4, 2013 @ 10:36PM
నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న గ్రీకు వీరుడు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. వెరైటీగా చేద్దామని ముందు వైజాగ్ బీచ్ లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ అనుకొన్నపటికీ, పోలీసులు అనుమతి ఈయకపోవడంతో నిన్న హైదరాబాదులో నిర్వహించారు.
ఈ ఫంక్షన్ లో నాగార్జున రెండవ కొడుకు అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. త్వరలో తానూ కూడా సినిమాలలో నటించాలనికోరుకొంటున్న అఖిల్ అందుకు తగ్గట్టుగానే హీరోలాగ మంచి హాండ్ సమ్ గా హుషారుగా తండ్రికి తగ్గ తనయుడిలాగ కనిపించాడు. అతనిని వేదిక మీదకి ఆహ్వానించినప్పుడు బుద్ధిగా వెళ్ళిపోకుండా నోట్లో వేళ్ళుపెట్టి గట్టిగా ఈల వేయడంతో ప్రేక్షకుల నుంచి కూడా అదే రీతిలో మంచి స్పందన వచ్చింది.
ఇక ఆడియో ఫంక్షన్ కి అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ తరలి రావడంతో ఫంక్షన్ కి చాలా నిండుతనం వచ్చింది. అందరూ సినిమాలలో నటించినవారే అవడంతో అంతమందిని ఒకే వేదికపై చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఆనందించారు. అదేవిధంగా సకుటుంబ సపరివారమంతా పక్కనే ఉండటంతో మన గ్రీకువీరుడికి కూడా ఎక్కడలేని హుషారు వచ్చేసింది. తను నిత్య యవ్వనంగా, అందంగా కనబడటానికి గల రహస్యాన్ని కూడా బయట పెట్టేసారు.
తన అభిమానుల నుండి అందుతున్న ఈ ఆధారణే తనను ఆనందంగా ఉంచుతోందని, అందువల్లే తానూ ఇప్పటికీ అందంగా కనబడగలుగుతున్నానని నాగ్ అన్నారు. అంతే కాదు తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ సినిమా రంగం నుండి రిటైర్ అయిపోవచ్చునేమో కానీ తానూ మాత్రం రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని అనడంతో ప్రేక్షకులు హుషారుగా ఈలలు వేసి ఆయనని ప్రోత్సహించారు.
ఇక ఈ సందర్భంగా నిర్మాత డి.శివప్రసాద రెడ్డి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావుగారికి తానూ వీరాభిమానినని, కానీ ఆయనతో సినిమా తీసే అవకాశం లేకపోయినా ఆయన కొడుకుతో తీయగలుగుతున్నదుకు చాలా సంతోషిస్తున్నాని అన్నారు. త్వరలో నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా ‘హలో బ్రదర్స్’ వాళ్ళబ్బాయిని హీరోగా పెట్టి రీమేక్ చేయబోతున్నానని ప్రకటించారు. అయితే అది నాగ చైతన్యాతోనా లేక అఖిల్ తోనా ఆయన చెప్పకపోయినప్పటికీ, సినిమాలలో నటించాలని ఆత్రుత పడుతున్న అఖిల్ ను హీరోగా పెట్టి ఆ సినిమా తీయవచ్చును..