‘బాద్‌షా’ సెన్సార్ కట్స్ ఇవే!
posted on Apr 3, 2013 @ 7:34PM
యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటించిన బాధ్షా సినిమా విడుదలకు కేవలం మరొక్క 36 గంటలు మాత్రమే మిగిలి ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గిర పడుతున్న కొద్దీ ఆ సినిమా గురించి ఒకటొకటిగా బయటకి వస్తున్న ఆసక్తికరమయిన వార్తలు బాధ్షా రేంజిని అమాంతం ఆకాశమంత ఎత్తుకు పెంచేశాయి. ఇక యన్టీఆర్ అభిమానుల సందడికి హద్దే లేదు.
శ్రీను వైట్ల కామెడీ, నందమూరి పులి చేసిన యాక్షన్ సీన్లు ఎపుడెపుడు చూద్దామా అని వారు ఒకటే తహతహలాడిపోతూ సినిమా టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. ఇక ఆ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా అనుకూలంగా రావడంతో బాధ్షా పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. నందమూరి అభిమానులకి తెలుగు వన్ అందిస్తున్న బాధ్షా సినిమా సెన్సార్ రిపోర్ట్:
దర్శకుడు శ్రీను వైట్ల తన బాధ్షాకు ‘యు’ సర్టిఫికేట్ పొందాలనే ముందు జాగ్రత్తగా సినిమాలో ప్రతీ చిన్న అంశాన్ని సెన్సార్ కళ్ళద్దాలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీసినా కూడా ఇంటర్వెల్ కి ముందు ‘రామారావు’ బాద్షా గా మారే సన్నివేశంలో కొంచెం వయోలెన్స్ ఎక్కువయిండానే కారణంతో బాద్షాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారని తెలిసింది.
కానీ, శ్రీను వైట్ల కష్టం వృధాపోలేదు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు అసలు కత్తెర ఉపయోగించే పని పడలేదని సమాచారం. అందువల్ల శ్రీను వైట్ల తన బాధ్షాను నందమూరి అభిమానులకు ఏవిధంగా చూపాలని భావించాడో పూర్తిగా ఆవిధంగానే చూపించగలుగుతున్నాడు.
ముఖ్యంగా బాధ్షా-బ్రహ్మానందం-యమ్మస్ నారాయణలతో కలిసి చేసిన హాస్య సన్నివేశాలను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు అంత అద్భుతంగా కామెడీ పండించిన నటులని, అంత గొప్పగా మలచిన దర్శకుడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారని సమాచారం,
ఇక సినిమాలో కట్స్ వేయకపోయినా ‘నీ అబ్బ, బలుపు, బొంగు, బొక్క వంటి పదాలకు బీప్ శబ్దాలు తగిలించేసారు. అదేవిధంగా బాద్షా సిగరెట్ కాల్చే సన్నివేశాలకి పొగ త్రాగుట హానికరం అనే హెచ్చరికలు తప్పని సరి. ఇక వెల్కం కనకం అనే పాటలో ‘కలకండ’ అనే పదంలో కూడా సెన్సార్ బోర్డు వారికి బూతు కనిపించడంతో దానికీ ఒక బీప్ తగిలించేసారు. ఇటీవల విడుదల అవుతున్న చిన్న సినిమాలో యూత్ ని ఆకర్షించేందుకు దర్శకులు విరివిగా బూతులు చొప్పిస్తున్నా అభ్యంతరం చెప్పని సెన్సార్ బోర్డు ‘కలకండ’ కి ఎందుకు బీప్ తగిలించిందో తెలియదు.
మొత్తం మీద సెన్సార్ కత్తెర భారిన పడకుండా బాద్షా తప్పించుకొన్నందుకు చాలా సంతోషించవలసిన విషయమే. శ్రీను వైట్ల మార్క్ కామెడీని, యంగ్ టైగర్ మార్క్ యాక్షన్ సన్నివేశాలని, పంచ్ డైలాగులను తీసుకు వస్తున్న బాద్షా ఘన విజయం ఖాయమని ముందే డిసైడ్ అయిపోయాడు గనుక ఇక మనం బాద్షాను సింపుల్ గా ఫాలో అయిపోవడమే బెటర్.