గవర్నర్ ప్రసంగం చప్పగా వుంది: ప్రతిపక్షాలు
posted on Jun 11, 2014 @ 11:27PM
తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం చప్పగా వుందని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ ప్రసంగం, కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చేలా లేవని ప్రతిపక్షాలు విమర్శించాయి. కెజి నుండి పిజి వరకు విద్యపై మార్గదర్శకాలు లేవన్నారు. గవర్నర్ ప్రసంగంతో రైతులకు నిరాశే అన్నారు. రుణమాఫీ పైన నిర్దిష్ట ప్రణాళికలు లేవన్నారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విషయాలనే గవర్నర్‌తో మరోసారి చదివించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రకటనలపై స్పష్టత వస్తుందని ఆశించామని అయితే, ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ ప్రజలు నిరాశకు గురయ్యారని అన్నారు. గవర్నర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారాలా వుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని, గవర్నర్ ప్రసంగంలో ఆ ఊసే లేదన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల ప్రస్తావన కూడా లేదన్నారు. ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.