Read more!

గోపీనాధ్ ముండే మృతి: మోడీ దిగ్భ్రాంతి

 

 

 

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపీనాధ్ ముండే కన్నుమూశారు. ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి వెళ్లడం కోసం ఢిల్లీ విమనాశ్రయానికి బయలుదేరిన ముండే కాన్వాయ్ మోతీబాగ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముండేకు తీవ్రగాయాలు కావడంతోపాటు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఈ ఉదయం 8 గంటలకు చికిత్స పొందుతూ కన్నుమూశారు.


1949 ఫిబ్రవరి 14న గోపినాథ్‌ముండే జన్మించారు. ఈయనకు భార్య ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్ర శాసనసభకు ముండే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992-1995 మధ్య మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అదేవిధంగా 1995 నుంచి 1999 వరకు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ముండే దుర్మరణం గురించి తెలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముండే మృతి విషయం తెలియగానే మోడీ ట్విట్టర్‌లో స్పందించారు. ముండే నిజమైన ప్రజా నాయకుడు అని, అతని మృతి దేశానికి, ప్రభుత్వానికి తీరని లోటు అన్నారు.ముండే కుటుంబ సభ్యులకు మోడీ తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. తాము వారికి అండగా నిలబడతామని చెప్పారు.