మున్సిపల్ జీతాలు పెంచలేం.. చేతులెత్తేసిన టీ సర్కార్
posted on Jul 24, 2015 @ 11:22AM
మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచమని వారం రోజులకుపైగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెను మొదట తెలంగాణ ప్రభుత్వం అంటీ అంటనట్టుగానే ఉంది. తరువాత వారి సమ్మెకు ప్రతిపక్షపార్టీలు మద్ధతు తెలిపి.. బంగారు తెలంగాణ చేస్తానని నగరాన్ని చెత్తగా మార్చారని.. మున్సిపల్ శాఖ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నా కాని సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ.. వెంటనే వాళ్ల సమస్యలు తీర్చాలంటూ పార్టీలు ధర్నా చేయడంతో దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం వారి వేతనాలు పెంచేందుకు అంగీకరించింది. దాంతో కార్మిక సంఘాలు కూడా సమ్మెను విరమించాయి. ఇక్కడ వరకూ బానే ఉంది. కానీ ఇప్పుడు జీహెచ్ ఎంసీ మినహా ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలలో ఇప్పటికిప్పుడు వేతనాలను పెంచలేమని చేతులేత్తేసినట్టు తెలుస్తోంది.
అయితే మున్సిపాలిటీ కార్మికులు వేతనాలపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను సంప్రదించింది. దీనికి సంబంధించి ఈ కమిటీ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు చెందిన మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలను పెంచాలని మునిసిపాలిటీల్లో పనిచేసే కార్మికులు కోరుతున్నారని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఓ నివేదికను పంపించింది. వాస్తవానికి మునిసిపాలిటీలే ఆ ఉద్యోగుల వేతనాలను చెల్లిస్తున్నాయి. కానీ ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి వల్ల అది సాధ్య కాదని.. ‘‘ప్రస్తుతం ఉన్న ఆదాయం మునిసిపాలిటీలను నిర్వహించడానికే చాలడం లేదని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు వేతనాల పెంపుపై ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలే తెలంగాణ ఖజానా కూడా ఖాళీ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతటా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించినప్పటికీ అది ఒక్క జీహెచ్ఎంసీ మాత్రమే పరిమితం చేసే యోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు దానికి కూడా వేతనాల పెంపు కష్టమే. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.