జీహెచ్ఎంసీ విభజన ఖాయమా?
posted on Feb 18, 2015 @ 9:52PM
జి.హెచ్.యం.సి బోర్డు రద్దయ్యి రెండున్నర నెలలవుతున్నా తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు దానికి ఎన్నికలు నిర్వహించలేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేయడానికే ఆలశ్యం జరుగుతోందని ఇంతకాలం రోజులు దొర్లించేసారు. కానీ ఇంతవరకు ఆ కార్యక్రమం పూర్తయిందో లేదో తెలియదు గానీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ తన పార్టీని మాత్రం ఎన్నికలకి పూర్తిగా సన్నధం చేసుకొన్నారు.
కానీ జి.హెచ్.యం.సి పరిధిలో ఆంద్రప్రజలు, ముస్లిములు ఎక్కువగా స్థిరపడి ఉన్నారు గనుక వారి ఓట్లే ఏ పార్టీకయినా కీలకం కానున్నాయి. వారి ఓట్లు తెదేపా, వైకాపా మరియు మజ్లిస్ ఖాతాల్లోకి వెళ్లి పోవచ్చును. మిగిలిన వారిలో హిందువుల ఓట్లు బీజేపీ నొల్లుకుపోతే ఇంక ఎన్ని సన్నాహాలు చేసినా తెరాసకు ఎన్ని వార్డులు మిగులుతాయో ఎవరికీ తెలియదు. కనుక “పరిపాలనా సౌలభ్యం కోసం” జి.హెచ్.యం.సిని రెండు లేదా మూడు కార్పోరేషన్లుగా విభజిస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
ఇంతకు ముందు హైదరాబాద్, సికింద్రాబాద్ లకు వేర్వేరు కార్పోరేషన్లే ఉండేవి. వాటిని 1960లో ఒకటిగా చేసి హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ చేసారు. ఆ తరువాత కాలంలో అదే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ గా అవతరించింది. కనుక మళ్ళీ జి.హెచ్.యం.సి విభజించినట్లయితే పరిపాలనా సౌలభ్యంతో బాటు వాటిపై తెదేపా, వైకాపా, మజ్లిస్ పట్టు తగ్గుతుంది కూడా. అప్పుడు వాటిలో ఏదో ఒక దానినయినా చేజిక్కించుకోవచ్చునని కేసీఆర్ భావించడం సహజమే. అందుకే రెండు బృందాలను డిల్లీ మరియు ముంబై నగరాలకు అధ్యయనం కోసం పంపించారు.
ఇంతకు ముందు ఒకటిగా ఉన్న ముంబై మునిసిపల్ కార్పోరేషన్ నుండి నవీ ముంబై కార్పోరేషన్ సృష్టించబడింది. అలాగే డిల్లీ కార్పోరేషన్ ఉత్తర, దక్షిణ, తూర్పు డిల్లీ కార్పోరేషన్లుగా మూడుగా విభజించబడింది. వాటిని అధ్యయనం చేసిన బృందాలు తమ నివేదికలను కేసీఆర్ కి సమర్పించాయి కూడా. కానీ ఆయన ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఒకవేళ జి.హెచ్.యం.సి.ని రెండు లేదా మూడు కార్పోరేషన్లుగా విభజించదలిస్తే, ఆ ఏర్పాట్లు పూర్తి చేసేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని జి.హెచ్.యం.సి. అధికారులు చెపుతున్నారు. కానీ వారం రోజుల్లోగా జి.హెచ్.యం.సి. ఎన్నికల షెడ్యుల్ ని హైకోర్టుకి సమర్పిస్తానని తెలంగాణా ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది. ఒకవేళ జి.హెచ్.యం.సి.ని విభజించదలిస్తే ప్రభుత్వం మళ్ళీ హైకోర్టును అందుకు సమయం కోరవలసి ఉంటుంది. కానీ కోర్టు అందుకు అంగీకరిస్తుందని భావించలేము. కనుక తప్పనిసరి పరిస్థితుల్లో యధాతధంగానే జి.హెచ్.యం.సి. ఎన్నికలకు వెళ్ళవలసి వస్తుందేమో? అదే జరిగితే ఇంత కసరత్తు చేసి ప్రయోజనం లేకుండాపోతుంది. కనుక ఈ సమస్యనుండి బయటపడేందుకు కేసీఆర్ ఎటువంటి వ్యూహం అనుసరిస్తారో మరో మూడు నాలుగు రోజుల్లోనే తేలిపోతుంది.