భారత ఓటర్ల వరమాల ఎవరికి..? సంబరాలు చేసుకొనేదెవరు?
posted on Jun 4, 2024 1:26AM
సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు ఎవరికి మద్దతు పలికారు? ఎన్డీయే కూటమికే మరోసారి జైకొట్టారా..? ఇండియా కూటమిని గద్దెనెక్కించబోతున్నారా? ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నది. కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలన్నింటికి మరికొద్ది గంటల్లో సమాధానం లభిస్తుంది. సంబరాలు చేసుకునేది ఎవరో తేలబోతున్నది. దేశవ్యాప్తంగా ఏడు విడ తల్లో 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశంలో 96.88 కోట్ల మంది ఓటర్లకు గాను ఏడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 64.2 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 31.2కోట్ల మంది.
బుధవారం (జూన్ 4) ఉదయం 8గంటల నుంచి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 10గంటల నుంచే ఒక్కో నియోజకవర్గం ఫలితం వెల్లడికానుంది. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.
దేశంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వానిదే అధికారమని కమల దళం ధీమాతో ఉంది. ఇండియా కూటమి శ్రేణులు మాత్రం తమదే అధికారమని చెబుతున్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని తేల్చాయి. కొన్ని సర్వే సంస్థలు ఇండియా కూటమి ఎన్డీయేకు కనీస పోటీకూడా ఇవ్వదని చెప్పుకొచ్చాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు ముచ్చటగా మూడోసారి ఎన్డీయే అధికార పీఠాన్ని అధిరోహించబోతున్నదా..? లేడా ఇండియా కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందా? అనే విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ క్షణాలకోసం దేశవ్యాప్తంగా ప్రజలేకాక.. ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి.