ప్రభుత్వ ఫర్నిచర్... జగన్‌కి ‘జీబీ’ మాములుగా లేదుగా!
posted on Jun 19, 2024 @ 3:16PM
2019లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుచేసుకుందాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు స్పీకర్‌గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ‘‘నా నివాసంలో కొంత ప్రభుత్వ ఫర్నిచర్ వుంది. వాటిని స్వాధీనం చేసుకోవల్సిందిగా కోరుతున్నాను’’ అని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకసారి కాదు.. రెండుసార్లు అలా లేఖ రాశారు. అయితే జగన్ ప్రభుత్వం ఆ లేఖలు దాచేసింది. లేఖలు రానట్టు నటించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన పదిహేను రోజుల తర్వాత కోడెల మీద కేసు పెట్టింది. ప్రభుత్వ ఫర్నిచర్ తన దగ్గర ఉంచుకున్నారని, తిరిగి ఇవ్వలేదనేది ఆ కేసు సారాశం. నిబంధనల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన పదిహేను రోజుల లోపల పాత ప్రభుత్వానికి సంబంధించినవారు తమ దగ్గర వున్న ప్రభుత్వ సామగ్రిని తిరిగి ఇచ్చేయాల్సి వుంటుంది. ఈ నిబంధన తెలిసే కోడెల రెండుసార్లు లేఖ కూడా రాశారు. జగన్ ప్రభుత్వం ఒక కుట్రప్రకారం ఆ లేఖలను దాచిపెట్టింది. గడువు దాటేవరకు వేచి చూసి, కోడెల మీద కేసు పెట్టింది. మానసికంగా వేధించింది. ఆయన క్రుంగిపో్యేలా చేసింది. చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది.
ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో, ఆయన క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వానికి సంబంధించిన చాలా ఫర్నిచర్, పరికరాలు వున్నాయి. బుద్ధీ జ్ఞానం వున్న ఎవరైనా ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఫర్నిచర్‌ని తీసుకెళ్ళాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ‘జీ’ (గర్వం), ‘బీ’ (బాధ్యతారాహిత్యం) ఎక్కువ కాబట్టి ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగి ఇవ్వకుండా కూల్‌గా కూర్చున్నారు. ఏ చేయని నేరాన్ని అయితే కోడెల శివప్రసాద్ మీద మోపి, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారో... అదే నేరాన్ని జగన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. జగన్‌కి వున్న అదృష్టం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయంగా వేధించే ప్రభుత్వం కాదు.. జగన్ ఆత్మహత్య చేసుకునేంత సున్నిత మనస్కుడూ కాదు.
జూన్ 4వ తేదీన ఎన్నిక ఫలితాలు వచ్చాయి. అంటే బుధవారం (19-06-24) నాటికి పదిహేను రోజుల గడువు పూర్తవుతుంది. ఇంతవరకు జగన్ వైపు నుంచి ఫర్నిచర్ తిరిగి ఇచ్చే ఉద్దేశాలేవీ కనిపించలేదు. దాంతో సచివాలయ జీఏడీ జగన్‌కి బుధవారం నాడు లేఖ రాసింది. ఆ లేఖలో జగన్ స్వాధీనంలో వున్న ఫర్నిచర్, వస్తువుల చిట్టాని కూడా జతచేసింది. అధికారం కోల్పోయిన 15 రోజుల్లోగా ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలన్న సచివాలయ నిబంధనల గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, తనదగ్గర వున్న ఫర్నిచర్ విషయంలో జగన్ వైపు నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం, సమాధానం రావడం లేదు. కానీ, వైసీపీ నాయకుడు అప్పిరెడ్డి స్పందించారు. తమ నాయకుడి దగ్గర వున్న ఫర్నిచర్ వెల ఎంతో లెక్క కడితే వాటికి డబ్బు చెల్లిస్తామని ఆయన అంటున్నారు. నిజానికి ఇలా స్పందించాల్సింది జగన్ మాత్రమే. అప్పుడు ప్రభుత్వం వస్తువులకు లెక్క కడుతుందా, లేక వస్తువులే కావాలని అంటుందా అనేది తర్వాత సంగతి. అలాంటిది జగన్ ఎంతమాత్రం స్పందించకుండా, ఎవరో దారిన పోయే దానయ్య స్పందించడం ఒక వింత. ఇప్పటికైనా జగన్ తన ‘జీ’ (గర్వం) ‘బీ’ (బాధ్యతారాహిత్యం) తగ్గించుకుని ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగి ఇచ్చే విషయంలో స్పందిస్తారో... లేక ఈ విషయాన్ని తెగేదాకా లాగి గొడవకి దిగుతారో చూడాలి.