ఏపీ జనం మీ ఓటర్లు కాదని అంటారా జగన్!
posted on Jun 19, 2024 @ 3:27PM
ఘోర ఓటమి షాక్ లో ఉన్న జగన్ కు అర్ధం కావడం లేదు కానీ.. బ్యాలెట్ అయినా, ఈవీఎంలైనా జగన్ కు ఇదే మర్యాద జరిగి ఉండేది. ఇప్పుడిలా ప్రజాస్వామ్యం, ఈవీఎంలు, నమ్మకం అంటూ మాట్లాడుతున్న జగన్ గత ఎన్నికలలో తన విజయంపై నమ్మకంతో ఈవీఎంలకు మద్దతుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయినా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి ముందే జగన్ తన పరాజయాన్ని బ్యాలెట్ లలోనే ఖరారు చేసుకున్నారు. ఆ విషయాన్ని చాలా కన్వీనియెంట్ గా మర్చిపోయి లేకపోతే మరిచిపోయినట్లు నటిస్తూ జగన్, ఆయన మేనమావ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వంటి వారు ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే చంద్రబాబు విజయం అంటూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. అయితే గత ఏడాది మార్చిలో బ్యాలెట్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల ఘోర పరాజయం గురించి ఇప్పుడు నెటిజనులు గుర్తుచేస్తూ జగన్ ఓటమి జనం రాసిన స్క్రిప్ట్ అని చెబుతున్నారు.
అప్పట్లో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీ పరాజయం పాలైనప్పుడూ, జగన్ తనకు పెట్టని కోటగా చెప్పుకునే రాయలసీమలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారనీ, ఆ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనూ జరిగిన విషయం జగన్ కు గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే అప్పట్లో సకల శాఖల మంత్రి, జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఓటమిని లెక్కే చేయం, అయినా వీళ్లు మా ఓటర్లు కాదని వాకృచ్చారు. ఇప్పుడూ మా పార్టీని ఓడించిన ప్రజలు మా ఓటర్లు కాదు అని అంటారా జగన్!