ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం... వైసీపీ మైండ్ గేమ్ ఫెయిల్!

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట వలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. 'నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్', అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే' అనే క్యాప్షన్ తో ఒంగోలులోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఇటు ఎన్టీఆర్ అభిమానులలో.. అటు టీడీపీ వర్గాలలో కలకలం రేపాయి. ఎందుకంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలోనే జరుగుతున్నది. ఆదివారం రాత్రికి కందుకూరు నియోజకవర్గం నుండి కొండేపి నియోజకవర్గంలో అడుగుపెట్టిన లోకేష్ పాదయాత్రకు ప్రకాశం జిల్లా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సమయంలోనే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ పేరిట వెలసిన ఈ ఫ్లెక్సీలు తీవ్ర దుమారం రేపాయి.

సహజంగానే ఈ ఫ్లెక్సీలు ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేశారనే తీవ్రచర్చ జరుగింది. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో టీడీపీ నేతలు తేల్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు వెలవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సార్లు వెలిశాయి. చంద్రబాబు సభలలో కూడా ఎన్టీఆర్ పేరుతో స్లొగన్స్ వినిపించాయి. ఈ మధ్య మహానాడులో కూడా ఎన్టీఆర్ పేరిట టీడీపీ జెండాలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈసారి లోకేష్ ని రెచ్చగొట్టేలా అందులో స్లోగన్లు రాయడంతో ఇది ఇంకాస్త కలకలం రేపింది. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అనే క్యాప్షన్ లోకేష్ ని టార్గెట్ చేస్తూ రాసిందేనని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే, గతంలో లేని విధంగా ఇలా టార్గెట్ చేయడం చూస్తే ఇది ఖచ్చితంగా వైసీపీ పనేనని స్పష్టమవుతుంది.

ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా స్పందించి స్పష్టత ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రకాశం జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులతో ఫోన్లో సంప్రదించి చర్చలు జరిపారు. ప్రకాశం జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో రాజకీయంగా కలకలం రేపిన ఫ్లెక్సీలకు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎటువంటి సంబంధం లేదని విస్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై తాము ఇప్పటికే రాష్ట్ర అసోసియేషన్ కు సమాచారం అందించామని.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటులో తమ హీరోకు కానీ.. అభిమానులకు కానీ ఎలాంటి సంబంధం లేదని.. ఇది ఎవరి పని అనేది కూడా  తాము బయటపెడతామని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇదే విషయంపై మాట్లాడిన  టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే  దామచర్ల జనార్దన్.. ఒంగోలు నగరంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే  దీని వెనుక ఎవరున్నారు, ఇది ఎవరి పని అన్నది  వెలికి తీశామన్నారు.  త్రోవగుంట పరిధిలో పనిచేస్తున్న అఫ్రిది అనే వాలంటీర్, త్రోవగుంట ఒకటవ డివిజన్ అధ్యక్షుడు సాంబశివరావులు ఈ ఫ్లెక్సీల విషయంలో ప్రధాన పాత్ర పోషించినట్లు గుర్తించామన్నారు. తమకు దక్కిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అసలు ఈ విషయంపై పూర్తి ఆధారాలు తమకు లభించాయన్నారు. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో, తెలుగు తమ్ముళ్ళ దృష్టిని మరల్చేందుకు వైసీపీ పన్నిన కుట్రే ఇది అని తేల్చేశారు. ఈ ఫ్లెక్సీలను కట్టిన సాయి అనే కుర్రాడే తమకు పూర్తి విషయాలను వెల్లడించారని జనార్దన్ చెప్పారు.

దీంతో ఎన్టీఆర్ పేరిట వెలసిన ఈ ఫ్లెక్సీలు వైసీపీ మైండ్ గేమ్ అని అన్ని వర్గాలకు స్పష్టత వచ్చేసింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇలాంటి మైండ్ గేమ్స్ తో టీడీపీని దెబ్బతీయాలని చూడడం కూడా కొత్తేమీ కాదు. కొడాలి నానీ, లక్ష్మి పార్వతి లాంటి వాళ్ళతో నందమూరి, నారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు వేసిన ఎత్తులు చాలానే  ఉన్నాయి. ఇప్పుడు ఇలా వాలంటీర్ల ద్వారా కూడా వైసీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. అయితే, 24 గంటలలోనే ఇది వైసీపీ నేతల పనేనని తేలిపోవడంతో రాజకీయాల వర్గాలలో వైసీపీ నేతలు మరింత చులకనయ్యారు.

Teluguone gnews banner