మాజీ ఎంపీ హర్ష కుమార్ మెడకు చుట్టుకుంటున్న నెంబర్ 93...
posted on Oct 4, 2019 @ 3:39PM
మాజీ ఎంపీ హర్ష కుమార్ నెంబర్ 93 తో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. గోదావరిలో కచ్చులూరు దగ్గర మునిగిన బోటులో ఉన్నది డెబ్బై మూడు మంది అని అధికారులు చెప్పారు కాని, కాదు తొంభై మూడు మంది ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితం హర్ష కుమార్ విమర్శించారు. మృతుల సంఖ్య ఎక్కువ లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారని, నిజాలు చెప్పాలంటూ గట్టిగా మాట్లాడారు. అంతేకాకుండా బోటుకు పర్మిషన్ వెనుక కొందరి హస్తం ఉందని ఆరోపించారు. అప్పుడు ఆయన చెప్పిన మాటల్లో 93 నెంబర్ ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేసింది. తొంభై మూడు మంది బోటు ఎక్కారా, ఆధారాలు ఉన్నాయా, ఉంటే చూపించండి అంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో హర్షకుమార్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.
మరోవైపు రాజమండ్రిలో తొమ్మిది వందల ఇరవై గజాల స్థలాన్ని న్యాయశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, అయితే ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తూ ఉండగా హర్షకుమార్ అడ్డుకున్నారు. దీంతో కోర్టు ఏవో సీతారామరాజు ఫిర్యాదు మేరకు హర్ష కుమార్ పై సెక్షన్ 353,354,506,34 ఐపీసీ కింద కేసు నమోదైంది. ఈ కేసులో హర్ష కుమార్ ను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని సీఐ శేఖర్ బాబును ఉన్నతాధికారులు వేటు వేశారు. సీఐపై వేటు వేయడాన్ని నిరసిస్తూ గోకవరం బస్టాండ్ దగ్గర దళిత నేతలు అందేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించనున్నారు.