గంటా నిజంగానే వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారా?
posted on Oct 4, 2019 @ 3:50PM
ఆగస్ట్ ఫీవర్ అంటూ నిన్న మొన్నటి దాకా బాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు వైసీపీ బాట పట్టబోతున్నారనే వాదనలు తెగ హడావిడి సృష్టించాయి. విశాఖ టిడిపి నేతల వారి వైఖరీ మార్చుకోబోతున్నారని సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ఫ్యాన్ పార్టీ చెంతన చేరనున్నరట. విశాఖ రూరల్ లో బలమైన నేత ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనందకుమార్, కుమార్తె రమాకుమారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టిడిపి పాలిట పిడుగు లాంటి మరో వార్త విస్తృతంగా చక్కర్ లు కొడుతోంది. విశాఖ జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తి టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. గతంలో ఇలాంటి వార్తలు హల్ చల్ చేసి చల్లబడ్డాయి. అదే ప్రచారం మళ్లీ జోరందుకుంది. గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయమంటూ తాజాగా కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో గంటా సంప్రదింపులు జరిపారని ఈ నెల మొదటి వారంలో ఫ్యాన్ పార్టీలో చేరబోతున్నారని చెప్పుకుంటున్నారు. వైఎస్ కుటుంబ సన్నిహితులతో గతంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని గంటా శ్రీనివాసరావు పావులు కదిపారని చెప్పుకుంటున్నారు. కడప జిల్లా ఇన్ చార్జి మంత్రిగా గతంలో పని చేసిన గంట శ్రీనివాసరావు అప్పట్లో వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తలతో పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయాలను ఇప్పుడు వాడుకుంటున్నారని సమాచారం.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంట శ్రీనివాసరావు తన ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కె రాజు పై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. అందుకు గంట కూడా ఓకే అన్నారని సమాచారం. ఈ తరుణంలో రాజీనామా చేస్తాను మరి నాకేంటి అని గంటా ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవి వదులుకుంటున్నందున ఎమ్మెల్సీ పదవి కావాలని గంట కోరారు. గంటా రాజకీయ అనుభవం ఆయనకు ఉన్న ప్రజాదరణ వంటి అన్ని అంశాలను పరిశీలించిన మీదట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఓకే అన్నట్టుగా వార్తలు షికార్ లు చేస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు గనుక పార్టీ మారితే ఆయన వర్గానికి చెందిన చాలా మంది టిడిపి నేతలు కూడా ఆయన వెంట నడుస్తారన్న చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రచారం అంతా ఊహాగానం అంటూ గంట వర్గీల్ కొట్టిపారేస్తున్నారు. గంటా పార్టీ మారరని టిడిపిలోనే కొనసాగుతారని వారు వాదిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి గంటా వస్తున్నారనే ప్రచారాన్ని విశాఖలో ఆ పార్టీకి చెందిన నేతలు కూడా ఖండిస్తున్నారు. అటువంటి సమాచారమేదీ తమకు అందలేదని వారు స్పష్టం చేస్తున్నారు. నిజంగా గంటా వ్యూహం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.