రోగనిరోధక శక్తిని పెంచే ఈ నాలుగు పదార్థాలను ఫ్రిజ్ లో అస్సలు ఉంచకూడదు..!

ఆరోగ్యానికి ఆహార పదార్థాలే మూలం. శరీరానికి శక్తిని ఇచ్చేవి, రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని  దృఢంగా  ఉంచేవి ఆహారాలే.  ప్రతి ఇంటి వంటిట్లో ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడే కొన్ని పదార్థాలు ఉంటాయి. వైద్య పరంగా కూడా ఇవి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వీటిని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ ఆరోగ్యానికి అంత గొప్ప ప్రయోజనాలు చేకూర్చే ఆ పదార్థాలేంటో.. వాటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కలిగే  నష్టం ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

అల్లం..

అల్లం గొప్ప ఔషద గుణాలు కలిగి ఉంటుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో వికారం వంటి సమస్యలు ఏవి వచ్చినా అల్లాన్ని తీసుకోమని చెబుతుంటారు. చాలా ఇళ్లలో అల్లాన్ని పెద్ద మొత్తం తెచ్చుకుని ఫ్రిజ్ లో ఉంచి వారాల కొద్దీ ఉపయోగిస్తుంటారు. అయితే అల్లాన్ని ఇలా ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదట. అల్లాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దాని మీద అచ్చు పెరుగుతుంది.  సరిగ్గా గమనిస్తే ఇది అల్లం పొట్టు తీసినప్పుడు పై భాగం డార్క్ కలర్ లోనూ లోపల అల్లం సాధారణ రంగులోనూ ఉంటుంది. దీన్ని విషపూరితమైన పదార్థంగా భావిస్తారు. ఇది మూత్రపిండాలు, కాలేయం వైఫల్యం కావడానికి కారణం అవుతుంది. కాబట్టి అల్లాన్ని ఫ్రిజ్ లో ఉంచకపోవడం మంచిది. దీన్ని గదిలో సాధారణ ఉష్టోగ్రత వద్ద ఉంచాలి.

అన్నం..

అన్నం మిగిలిపోతే కొందరు ఫ్రిజ్ లో పెడుతుంటారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి రైస్ ఆధారిత ఆహారాలు మిగిలిపోతే పడేయలేక ఫ్రిజ్ లో ఉంచుకుని తింటుంటారు. కానీ అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచితే అది విషపూరితమైన పొరను ఏర్పరచుకుంటుంది. ఇది ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా అన్నం ఆధారిత ఆహారాలు ఏవైనా వండిన తరువాత 24 గంటల కంటే ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచకూడదు.

వెల్లుల్లి..

రోగనిరోధక శక్తిని పెంచే ఔషదంగా వెల్లుల్లిని పరిగణిస్తారు. అల్లంతో పాటు వెల్లుల్లిని ఉపయోగించడం చాలా కామన్ అయిపోయింది. చాలామంది కూరల్లో అల్లం వెల్లుల్లి వినియోగం కోసం రెండింటిని కలిపి పేస్ట్ చేసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ పొట్టు తీయని వెల్లుల్లిని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకోవాలి. కూరల్లో వినియోగించే ముందు కాస్త సమయం పట్టినా అప్పటికప్పుడు పేస్ట్ చేసుకుని వాడటం మంచిది. వెల్లుల్లిని ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయాలి.

ఉల్లిపాయలు..

ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టేవాళ్లు అయితే ఉండరు. కానీ కొన్నిసార్లు కొందరు తెలిసో తెలియకో పెట్టేస్తుంటారు. ఉల్లిపాయలను తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఫ్రిజ్ లో ఉల్లిపాయలను ఉంచితే వాటిలో ఉన్న పిండి పదార్థాలు చక్కెరలుగా మారతాయి. పైపెచ్చు చాలా సులువుగా బూజు పడతాయి.  సగం తరిగిన ఉల్లిపాయలను, ఉల్లి ముక్కలను ఫ్రిజ్ లో ఉంచేవారు ఈ అలవాటు మానుకోవాలి.  అంతేకాదు.. ఉల్లిపాయలను సాధారణ ఉష్ణోగ్రత వద్ద అయినా సరే.. కవర్లలోనూ, బ్యాగులలోనూ, బంగాళాదుంపలతో కలిపి ఉంచకూడదు.

  
                                 *నిశ్శబ్ద. 

Teluguone gnews banner