ఆ దేశం అప్పు 45 లక్షల కోట్లు.. ఒక్కొక్కరిపై లక్షా 75 వేలు
posted on Mar 16, 2021 @ 11:39AM
ఉగ్రవాదులకు అడ్డాగా చెప్పుకునే పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశం అప్పుల ఊబిలో మునిగిపోయింది. పాకిస్థాన్ మెడపై ఆర్థిక సంక్షోభం కత్తి వేలాడుతోంది. 2019 డిసెంబర్ నాటికి పాకిస్థాన్ అప్పులు 40.94 ట్రిలియన్ రూపాయలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం గడువు లోనే పాకిస్థాన్ అప్పులు 45 ట్రిలియన్లకు పెరగనున్నాయి. అంటే పాకిస్తాన్ అప్పు 45 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఇవి పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన వివరాలివి. పాకిస్థాన్ ఆర్థిక శాఖ రిపోర్ట్ కూడా దీన్ని బలపర్చింది. తాజాగా పార్లమెంట్ లో ఆ దేశ ఆర్థిక మంత్రి దేశానికి ఉన్న అప్పుల గురించి వెల్లడించారు. ఈ అప్పులన్నింటినీ పాకిస్థాన్ లో ఉన్న 21.66 కోట్ల మంది కి సమానంగా పంచితే ఒక్కొక్కరికీ లక్షా 75 వేల రూపాయల అప్పు ఉన్నట్లుగా తేలుతుంది.రెండేళ్లలో ఒక్కొక్కరిపై సగటున 55 వేల రూపాయల అప్పు పెరగడం పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తోంది. 2018 మధ్య నాటికి పాకిస్థాన్ కి ఉన్న అప్పుల విలువ 24.9 ట్రిలియన్ రూపాయలు.
పాకిస్థానీ న్యూస్ పేపర్ ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యాక ఈ అప్పులు 46 శాతం పెరిగాయట. ఇంతకుముందు కూడా పాకిస్థాన్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ లేకపోయినా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పాలనలో మరింత దిగజారింది. ఆ తర్వాత కరోనా వల్ల ఆర్థిక భారం ఎక్కువైంది. ఆ మేరకు అప్పులు కూడా పెరిగాయి. మిగిలిన దేశాలన్నింటితో పోల్చితే పాకిస్థాన్ లో లాక్ డౌన్ చాలా తక్కువ కాలం కొనసాగింది. తమ దేశం పేద దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ పై భారం పడకూడదని చెబుతూ ఇమ్రాన్ లాక్ డౌన్ ని ఎత్తేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. గతంలో ఆర్థిక శాఖ చెప్పిన వివరాల ప్రకారం పాకిస్థాన్ ప్రభుత్వం తాను రూపొందించుకున్న ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్రెడిట్ లిమిట్ (ఎఫ్ ఆర్ డీ ఎల్) చట్టాన్ని అతిక్రమించింది. 2005 లో ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికి ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కంటే ద్రవ్య లోటు 4 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఈ ద్రవ్యలోటు 8.6 శాతంగా ఉంది. ఇది నిర్ణయించిన రేటుకు రెట్టింపు కంటే ఎక్కువ కావడం విశేషం. .
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాకిస్థాన్ ఒక దేశం నుంచి అప్పు చేస్తూ మరో దేశానికి దాన్ని చెల్లిస్తోంది. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి రావడంతో అప్పులు పెరుగుతున్నాయి. తాజాగా ఇతర దేశాల్లో ఉన్న పాకిస్థాన్ ఆస్తులను అమ్మే వరకూ పరిస్థితి వచ్చింది. ఇతర దేశాలకు చెందిన మైనింగ్ కంపెనీలు తమ దేశంలో బంగారాన్ని తవ్వుకోవచ్చని అంగీకరించిన పాకిస్థాన్ అగ్రిమెంట్ అయ్యాక మనసు మార్చుకొని వారికి అనుమతిని నిరాకరించింది. అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసింది. దీనిపై కంపెనీలు కోర్టుకి వెళ్లగా పాకిస్థాన్ ఈ కేసును కూడా ఓడిపోయింది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) తనకు పాకిస్థాన్ అప్పు బకాయి ఉన్న బిలియన్ డాలర్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసేంతగా.. గతంలో కూడా యూఏఈ ఇలాగే డిమాండ్ చేసింది. అప్పుడు చైనా ముందుకొచ్చి పాకిస్థాన్ కి సాయం చేసింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా మారిన తర్వాత ఇలా ఒక దేశం నుంచి సహాయం తీసుకొని మరో దేశానికి అప్పులు తీర్చడం ఆ దేశానికి కామన్ గా మారింది.