చంద్రబాబుతోపాటు మరో ఎనిమిది మందిపై సిఐడి కేసులు
posted on Mar 16, 2021 @ 11:31AM
ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో సిఐడి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ ఉదయం అయన హైదరాబాద్ నివాసంలో నోటీసులు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆయనతో పాటు అప్పట్లో పురపాలక శాఖా మంత్రిగా ఉన్న మరో టీడీపీ నేత నారాయణకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది.
వైసిపి ప్రతిపక్షంలో ఉండగా అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాలపడ్డారని ఆరోపిస్తూ వచ్చింది. ఆ తరువాత 2019 ఎన్నికలలో గెలిచి.. జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అవకతవకలపై విచారణ చేయడానికంటూ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం భూముల వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. భూముల అక్రమాల వ్యవహారంలో సంబంధం ఉన్న టీడీపీ నేతల జాబితాను కూడా మంత్రివర్గ ఉపసంఘం సమర్పించింది. ఈ నివేదికలో చంద్రబాబుతోపాటు నారాయణ, పుట్టా మహేష్ యాదవ్, పరిటాల సునీత, లోకేష్, పయ్యావుల కేశవ్, వేమూరు రవికుమార్, జీవీ ఆంజనేయులు, లంకా దినకర్, లింగమనేని రమేష్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ పేర్లను పేర్కొంది. దీంతో ఈ నివేదిక ఆధారంగా సీఐడి కేసులు నమోదు చేసి.. తాజాగా ఈ వ్యవహారంపై బాబుతోపాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే రాజధాని ప్రకటనకు ముందే ముఖ్య నేతలు తమ అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు అయినట్లు సమాచారం. ఆ సందర్భంలో అసైన్డ్ రైతులను మోసం చేసి తమ అనుచరులకు లబ్ధి చేకూర్చారని ఇందులో ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై హైకోర్టులో కూడా విచారణ కూడా జరిగింది. ఈ విషయంలో చంద్రబాబుకు ఏమాత్రం సంబంధం లేదంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది.అయితే రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని..దీంతో అసైన్డ్ రైతులు మోసపోయారని.. మరోపక్క టీడీపీ నేతల అనుచరులకు లబ్ధి కలిగించారని కేసు నమోదు చేయడం జరిగింది.
ఇది ఇలా ఉండగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇది జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగమేనని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మండి పడుతున్నారు. వైసిపి బెదిరింపులకు తాము ఎంతమాత్రం భయపడేది లేదని స్ఫష్టం చేస్తున్నారు