'మిర్చి' పవర్ చూపిస్తున్న ప్రభాస్
posted on Feb 20, 2013 @ 11:44AM
ఇటీవల విడుదలయిన ‘మిర్చి’ సినిమాతో దుమ్ము లేపుతున్నరెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు యువతకు ఆరాధ్య హీరో అయిపోయాడు. నైజాం ప్రాంతంలో కేవలం 11 రోజుల్లో 11.10 కోట్ల వసూళ్ళు రాబట్టిన ‘మిర్చి’ ప్రభాస్ క్యారీర్లోనే ఒక పెద్ద హిట్టుగా నిలబోతోంది. నిన్నమొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రెండో స్థానానికే పరిమితమయిపోయిన ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో నెంబర్: 1 స్థానానికి ఎదిగిపోయాడు. గతంలో ‘ఛత్రపతి’, ‘మిస్టర్.పెర్ఫెక్ట్’, ‘డార్లింగ్’వంటి హిట్స్ ఇచ్చినా అవి అతనిని నెంబర్: 1 స్థానానికి తీసుకువెళ్ళలేకపోయాయి.
దీనికి ముందు విడుదలయిన రెబెల్ సినిమాపై ప్రభాస్ చాల ఆశలు పెట్టుకోన్నపటికీ, అది ఘోరంగా విఫలం అవడంతో అతను చాలా నిరాశ చెందాడు. అయితే, ఊహించని విదంగా ‘మిర్చి’ అతనికి పెద్ద విజయం అందించడమే కాకుండా, కమర్షియల్ హీరోగా ఒక కొత్త గుర్తింపును కూడా ఇవ్వడంతో, ప్రభాస్ టాలివుడ్ లో నెంబర్: 1 స్థానానికి ఎదిగిపోయాడు. ఈ ఘనత ‘మిర్చి’ని అంత ఘాటుగా దంచి వడ్డించిన కొరటాల శివకే దక్కుతుందని నిసందేహంగా చెప్పవచ్చును.
ఎన్నో సినిమాలకు రచయితగా కధలందించిన కొరటాల, తన తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ఇంత పెద్ద విజయం సాదించడమే కాకుండా, ప్రభాస్ స్థాయి పెరిగేందుకు కూడా దోహదపడ్డాడు. అంతేకాకుండా, చాలా కాలంగా సరయిన హిట్స్ లేక డీలాపడిపోయిన బెంగాలీ అందాల భామ రిచా గంగోపద్యాయకు కూడా ఈ సినిమాతో కొరటాల పెద్ద హిట్ ఇచ్చి ఆమెను కాపాడడాని చెప్పవచ్చును. ఈ సినిమాతో ప్రభాస్ కి, రిచాల సినీ ప్రస్థానంలో కొత్త మలుపునీయడమే కాకుండా, తనకీ ఒక మంచి దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగాడు కొరటాల శివ.
ఈ సినిమా విజయం సాదించడంతో, ఆయనకు రామ్ చరణ్ తేజ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కూడా వెంటనే దొరికింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది.