రాణాకు క్షమాపణ చెప్పిన అపరిచితుడు
posted on Feb 18, 2013 @ 6:45PM
తమిళ నటుడు విక్రం ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో దక్షిణాది నటులేవరూ బాలివుడ్ కి ఎందుకు వెళ్ళట్లేదు?అనే ప్రశ్నకు జవాబిస్తూ గతంలో కమల్ హస్సన్ ‘ఏక దూజేకేలియే’, ‘సాగర్’ వంటి హిందీ సినిమాలు చేసినప్పటికీ, ఆయనకూడా చివరికి దక్షిణాది సినిమాలకే పరిమితమయిపోయారని చెపుతూ, తెలుగు సినిమాలు కాదనుకొని బాలివుడ్ వైపు వెళ్ళిన దగ్గుబాటి రాణా అందుకు భారీ మూల్యమే చెల్లించాడని అన్నారు. ఇక్కడ వస్తున్నమంచి ఆఫర్లను వదులుకొని అక్కడికి వెళ్లి కష్టపడటం ఎందుకని అన్నాడు.
అయితే, ఈ మాటలు మీడియా ద్వారా రాణా చెవులలో వేరేవిదంగా పడటంతో అతను చాలా తీవ్రంగా స్పందించాడు. “25ఏళ్ల బట్టి సినిమాలలో నటిస్తున్న విక్రం, కేవలం రెండున్నర ఏళ్ల క్రితం సినీరంగంలో ప్రవేశించిన నా గురించి మాట్లాడే బదులు, 10 ఫ్లాపులతో అస్తవ్యస్తమయిన తన కెరీర్ గురించి ఆలోచించుకొంటే బాగుంటుంది,” అని అన్నాడు. అయితే, విక్రం రాణా పేరును కేవలం చిన్నఉదాహరణగా పేర్కొనడంతో సమస్య జటిలమయింది. ఇది తెలుసుకొన్నవిక్రం స్వయంగా రాణాకు ఫోన్ చేసి క్షమాపణలు కోరి మీడియా చేతుల్లోపడి ఈ కధ మరింత గాట్టెక్కక మునుపే ముగింపు పలికాడు. వెంటనే రాణా కూడా స్పందిస్తూ, ఇది కేవలం మీడియా కల్పిత కధలు జోడించడం వల్లనే జరిగిందని, ఇక ఈకధ ఇక ముగిసిపోయిందని ట్వీటర్ లో మెసేజ్ పెట్టాడు.