మంత్రికి చుక్కలు చూపించిన రైతు
posted on Jul 9, 2021 @ 7:44PM
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి ప్రజా గ్రహానికి వేదకవుతోంది. తమ సమస్యలపై ప్రజా ప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. మంత్రులను ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రైతుల నుంచి అధికార పార్టీ నేతలకు అడుగడుగునా నిరసన వ్యక్తమవుతోంది. రైతు రుణమాఫీపై నిలదీస్తుండటంతో ఏమి చెప్పలేక కొందరు మంత్రులు అక్కడి నుంచి జారుకుంటుండగా.. కొందరు మంత్రులు మాత్రం ఆగ్రహంతో తన కోపాన్ని రైతులకు చూపిస్తున్నారు. ఇలాగే తనను ప్రశ్నించిన రైతుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలోని మెట్లచిట్టాపూర్ గ్రామంలో రైతు వేదికను ప్రారంభోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. సభ జరుగుతుండగా ఓ రైతు నేరుగా వేదికపైకి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫి ఇంతవరకు అమలు కాలేదని ప్రశ్నించారు. అంతలోనే మంత్రి దయాకర్ రావు నీది ఏపార్టీ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఇంతలో పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అనడంతో వెంటనే మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. స్టేజి దిగిపో అంటూ మంత్రి చెప్పడంతో తేరుకున్న పోలీసులు రైతును వేదిక పై నుండి తీసుకువెళ్లారు.
మంత్రి దయాకర్ రావు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు ఏ పార్టీ అయితే ఆయనకేంటి..ప్రభుత్వం ప్రకటించినట్టుగా రైతు రుణమాఫి చేయాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు. మంత్రి స్థాయిలో ఉండి రైతుకు సమాధానం చెప్పాల్సిన మంత్రి పార్టీల పేరుతో తప్పించుకోవడంపై కూడా పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాకా రైతు రుణమాఫి ప్రకటించింది. లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు పూర్తిగా మాఫి చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే రెండున్నర ఏండ్లు గడుస్తున్నా కేవలం 25 వేల లోపు అప్పులు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫిని పంపిణి చేశారు. మిగితా రైతులంతా రుణమాఫీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. విపక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. దీంతో కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, సుమారు లక్ష కోట్ల రూపాయలు ఆదాయం తగ్గినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
మరోవైపు రుణ మాఫి కాగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఉన్న అప్పులు కట్టకపోవడంతో పాటు కొత్త అప్పులు ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు ముందుకు రావడం లేదు..దీంతో పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్టు చెబుతున్నారు.