కేసీఆర్ ను భయపెడుతున్న కరీంనగర్ మాజీ ఎంపీ
posted on Sep 11, 2015 @ 4:15PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సెటైర్ల మీద సెటైర్లేస్తున్నారు. కేసీఆర్ చైనా వెళ్లిన వెంటనే, స్పీకర్ ను వెంట తీసుకెళ్లడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పొన్నం, ఈసారి వర్షాల సెంటిమెంట్ ను పండించి టీఆర్ఎస్ లో దడ పుట్టించారు. కేసీఆర్ ...తెలంగాణకు శనిగా దాపురించారని, అందుకే ఆయన చైనా వెళ్లిన వెంటనే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. మరి కొన్నాళ్లు కేసీఆర్ చైనాలోనే ఉంటే బాగుంటుందని...తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉంటారని ఎద్దేవా చేశారు. ట్యాంక్ బండ్ పై సూసైడ్ చేసుకున్న లింబయ్య... వ్యవసాయ కారణాలతో ఆత్మహత్య చేసుకోలేదన్న మంత్రుల వ్యాఖ్యలపై పొన్నం ఫైరయ్యారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోకుండా, అనుచితంగా మాట్లాడాతారా అంటూ నిప్పులు చెరిగారు. లింబయ్య ఆత్మహత్యపై బహిరంగ చర్చకు రావాలంటూ...గులాబీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 55మందికే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించిన పొన్నం... ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 5లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.