బీజేపీలోకి మరో కీలక నేత?
posted on Jun 4, 2021 9:28AM
తెలంగాణ బీజేపీలోకి వలసల జోరు కనిపిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపోమాపో కమలం గూటికి చేరనుండగా.. ఆయనతో పాటు టీఆర్ఎస్ లోని పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ , జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ ఈటలతో కలిసి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. రాజేందర్ దారిలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరనున్నారని సమాచారం.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చేవెళ్ల ఎంపీగా గెలిచారు కొండాయ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్న కొండా.. గురువారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో ఆమె ఫాంహౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డిని అరుణ బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కొండా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. టీజేఎస్ అధినేత కోదండరామ్ వంటి నేతలతో చర్చలు జరిపారు. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత రాజేందర్ తోనూ పలు సార్లు సమావేశమయ్యారు. దీంతో ఈటల, కొండా కలిసి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. అయితే రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఈటల దారిలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని డిసైడయ్యారు. తాజా చేరితలతో తెలంగాణలో బీజేపీకి మరింత బూస్ట్ వచ్చినట్లే.