ఈటల రాజేందర్ హ్యాండ్సప్! హుజురాబాద్ లో పోటీ లేనట్టే?
posted on Jun 3, 2021 @ 9:19PM
తెలంగాణ రాజకీయాలన్ని ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ తొలగించినప్పటి నుంచి రోజుకో కీలక పరిణామం జరుగుతూనే ఉంది. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కొన్ని రోజులు సాగింది. కాంగ్రెస్ నేతలతో రాజేందర్ టచ్ లోకి వచ్చారనే చర్చ జరిగింది. తర్వాత కమలం గూటికి చేరుతున్నారని చెప్పుకున్నారు. చివరకి రాజేందర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే ఖాయమైంది. ఢిల్లీకి వెళ్లి కమలం పెద్దలతో చర్చలు కూడా జరిపారు. రేపుమాపో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడమే మిగిలి ఉంది.
ఈటల బీజేపీలో చేరనుండటంతో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. రాజేందర్ బీజేపీలో చేరినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావడం లేదు. రాజేందర్ రాజీనామా ఇప్పుడే ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం ఆసక్తిగా మారింది. అయితే తాజాగా ఈటల అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం పక్కా అని తెలుస్తోంది. రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికలో మాత్రం రాజేందర్ పోటీ చేయరని చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన సతీమణి జమునను పోటీలో నిలిపే యోచనలో ఈటల ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఈటల బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే దుబ్బాక ఉప ఎన్నిక మాదిరిగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ జరిగే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఈటలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని భావిస్తున్న గులాబీ బాస్ ... ఇప్పటికే హుజురాబాద్ పై ఫోకస్ చేశారు. ఈటల వెంట టీఆర్ఎస్ నేతలు ఎవరూ వెళ్లకుండా ముఖ్యనేతలను రంగంలోకి దింపారు. మంత్రి గంగుల కమలాకర్ పూర్తిగా ఈటల నియోజకవర్గంపైనే దృష్టి సారించగా.. ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తనకు అత్యంత సన్నిహితుడైన హరీష్ రావును మోహరించడంతో.. పోటీపై ఈటల వెనుకాడుతున్నారని తెలుస్తోంది.
తన రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ జీవితం సమాధి అయినట్లేనని రాజేందర్ కుడా భయపడుతున్నారట. ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహాలు అద్బుతంగా ఉంటాయని చెబుతారు. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు నిలవలేకపోయాయి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై పోల్ లోనూ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చిత్తుగా ఓడించింది అధికార పార్టీ. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు రాజేందర్ కు తెలుసు కాబట్టే ఆయన వెనుకాడుతున్నారని చెబుతున్నారు. అందుకే తనకు రాజకీయంగా ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో పాటు జమునను పాలిటిక్స్ లోకి అరంగ్రేటం చేసే యోచనలో రాజేందర్ ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాల ముందు జమున ఓడినా.. పెద్దగా నష్టం ఉండదనే ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
హుజురాబాద్ లో పోటీపై తన అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలకు కూడా రాజేందర్ చెప్పారని.. వాళ్లు కూడా సానుకులంగా స్పందించారని తెలుస్తోంది. ఈటల సూచనతో నియోజకవర్గంలో ఇప్పటికే జమున తన యాక్షన్ మొదలు పెట్టారని కూడా చెబుతున్నారు. గతంలోనూ హుజురాబాద్ పార్టీ కార్యక్రమాలను జమున చూసేవారని తెలుస్తోంది. మంత్రిగా ఈటల బిజీగా ఉండటంతో.. నియోజకవర్గ పనులను ఆమె చక్కపెట్టేవారని అంటున్నారు. ఈటల అనుచరులతోనూ జమునకు మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జమునను పోటీ చేయించాలని రాజేందర్ ప్రయత్నించారనే టాక్ కూడా ఉంది.