బ్యాడ్‌బాయ్‌కి గుడ్‌బై!
posted on Jan 16, 2014 @ 1:07PM
నిన్న మొన్నటి వరకూ వై.ఎస్.జగన్ని గుడ్‌బాయ్ అని పొగిడి, అతని తప్పులన్నిటినీ వెనకేసుకుని వచ్చిన వైసీపీ పెద్దలు ఇప్పుడు ఆయన్ని బహిరంగంగానే బ్యాడ్‌బాయ్ అని విమర్శిస్తున్నారు. బుద్ధి గడ్డితిని బ్యాడ్‌బాయ్‌ని గుడ్‌బాయ్ అనుకున్నామని చెంపలేసుకుంటున్నారు. ఒక్కరొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇంతకాలం జగన్ సన్నిధిలో అణిగిమణిగి, పిల్లల్లా ఒదిగి వున్నవాళ్ళు కూడా ఇప్పుడు జగన్ని తన పిల్లల్ని తానే తినే పాముతో పోలుస్తున్నారు.
సంచలనాత్మకంగా మాట్లాడటంలో ఘనాపాటీ అయిన మాజీ మంత్రి మారెప్ప ఈమధ్య జగన్ మీద విరుచుకుపడిన విషయం, ఆ తర్వాత ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. పార్టీలో అంకురించిన తిరుగుబాటు మారెప్పతో మొదలైంది కాదు... మారెప్పతో ముగిసేది కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్సీపీలో కిందిస్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల వరకూ ఏదో ఒక రూపంలో అసంతృప్తి వుందని అంటున్నారు. జగన్ నిరంకుశ ధోరణి వల్ల అతనితో చాలా సన్నిహితంగా వుండేవారు కూడా పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా వున్నారని సమాచారం.
దాదాపు 80 శాతం మంది కార్యకర్తలు ఇప్పటికే పార్టీ మారడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని జంప్ అయిపోవడానికి రెడీగా వున్నారని సమాచారం. పార్టీ పెట్టిన దగ్గర్నుంచి, జగన్ జైల్లో వున్నప్పుడు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన చాలామంది కీలక నాయకులు వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ ఆకాంక్షను వాళ్ళు జగన్ దగ్గర వ్యక్తం చేసినప్పుడు జగన్ వాళ్ళని పూచిక పుల్లను తీసిపారేసినట్టు మాట్లాడాడని, దాంతో వాళ్ళ జగన్ పట్ల గుర్రుగా వుండి పార్టీకి దూరమైపోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
పార్టీకి దూరమయ్యేది కూడా చాలా కీలక సమయంలో జగన్ నెత్తీనోరూ బాదుకునే స్థాయిలో దూరమవ్వాలని భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బయటి నాయకులు మాత్రమే కాకుండా జగన్ కుటుంబ సభ్యులు కూడా జగన్ వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో వున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య తన కుటుంబ సభ్యుల్లో తన పట్ల వున్న వ్యతిరేకతని జగన్ కూల్ చేసినప్పటికీ, వాళ్ళలో జగన్ పట్ల వ్యతిరేకత మళ్ళీ రాజుకున్నట్టు రాజకీయవర్గాల భోగట్టా.